
సింగరేణిలో ఆర్టీఐకి అడ్డంకులు
● సమాచార అధికారుల నియామకంలో జాప్యం ● నిలిచిన దరఖాస్తుల స్వీకరణ
శ్రీరాంపూర్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్టీఐ దరఖాస్తులకు అడ్డంకి ఏర్పడింది. కంపెనీలోనే అతిపెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్‌లో అధికారులు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ యాక్ట్–2005) దరఖాస్తులు స్వీకరించడం లేదు. మూడు నెలలుగా ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో సమాచారం కోరే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏరియా పరిధిలో ఈ చట్టం కింద దరఖాస్తులు స్వీకరించాల్సిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐవో), అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అఫీసర్ (ఏపీఐవో) లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. పీఐవో గా బాధ్యతలు స్వీకరించిన ఓ డీజీఎం అధికారి ఏ ప్రిల్ 15న అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఆయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు. ఆతర్వాత ఏపీఐవోగా బాధ్యతలు నిర్వహించిన అధికా రి కూడా గత నెల ఇక్కడి నుంచి ఇతర ఏరియాకు బదిలీ అయ్యాడు. ఆ స్థానాన్ని కూడా భర్తీ చేయలేదు. దీంతో ఈ రెండు సీట్లు ఖాళీగానే ఉంటున్నా యి. పీఐవో బాధ్యతలు నిర్వహించే అధికారి మృతి చెందిన తరువాత మరో పూర్తిస్థాయి అధికారిని నియమించే వరకు ఏపీఐవోకు ఇన్‌చార్జి పీఐవో బాధ్యతలు అప్పగించడానికి అనుమతి కోరుతూ ఏరియా అధికారులు కార్పొరేట్ అధికారులకు లేఖ రాశారు. వారు ఆలస్యంగా స్పందించడంతో ఆలోపే సదరు ఏపీఐవో అధికారి కూడా ఇక్కడి నుంచి వేరే ఏరియాకు బదిలీ అయ్యారు. దీంతో ఈ రెండు బాధ్యతలను చూసేవారు కరువయ్యారు.
వెనుదిరిగి పోతున్న దరఖాస్తుదారులు
సమాచారం హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకో వడానికి జీఎం కార్యాలయానికి వచ్చిన కార్మికులు, సమాచార చట్టం కార్యకర్తలు, పౌర సమాజ కార్యకర్తలు అక్కడ అధికారులెవ్వరూ దరఖాస్తులు స్వీకరించకపోవడంతో వెనుదిరిగి పోతున్నారు. ఆ స్థానాల్లో అధికారులు వచ్చేంత వరకు తమకు ఈ దరఖాస్తులు స్వీకరించే అధికారం లేదని ఇతర అధి కారులు వారికి చెప్పి తిప్పి పంపిస్తున్నారు. దీనికి తోడు ఇది వరకే పీఐవోకు దరఖాస్తు చేసుకున్నాక సరైన సమాచారం, స్పందన లేకపోవడంతో అప్పిలేట్ అఽధికారిగా ఉన్న ఏరియా జీఎంకు దరఖాస్తులు చేసుకున్న వారూ ఉన్నారు. ఆ దరఖాస్తులపై కూడా నిర్ణయం తీసుకోవాలంటే కూడా పీఐవో వద్ద సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. పీఐవో లేకపోవడంతో అప్పిలేట్ దరఖాస్తులు కూడా పరిష్కారానికి నోచుకోకుండా మరుగునపడ్డాయి. కార్పొరే ట్ అధికారుల జాప్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. చట్టబద్ధత గల ఇలాంటి పోస్టుల భర్తీలో జాప్యం చేయడం సరికాదని, ఇలా చట్టాలను నీరుగార్చుతున్నారని దరఖాస్తు దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం పరిరక్షణ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కార్పొరేట్‌కు లేఖ రాశాం..
పీఐవో, ఏపీఐవో పోస్టులు భర్తీ చేయడం కోసం కార్పొరేట్ అధికారులకు లేఖ రాశాం. కార్పొరేట్ అధికారుల ఆదేశాల మేరకే ఈ నియామకాలు జరుగుతాయి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం.
– ఎం.శ్రీనివాస్, జీఎం, శ్రీరాంపూర్