
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిర్మల్‌టౌన్: షట్టర్ లిఫ్టింగ్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉమ్రికి చెందిన రాజుసింగ్ మోహన్‌సింగ్, సేవక్ సింగ్ రఘుబీర్‌సింగ్, సుర్దిప్ సింగ్ ముగ్గురు బంధువులు. నిర్మల్ జిల్లాలో కూలి పనులు చేసేవారు. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న రాత్రి బైక్‌పై లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ చేరుకుని పెట్రోల్ బంక్ సమీపంలోని ఇంటి ముందున్న బైక్‌ను దొంగలించారు. అనంతరం ఓ గోల్డ్‌షాప్‌లో చొరబడి బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు. అదే రాత్రి ఉమ్రికి వెళ్తూ మార్గమధ్యలో కుంటాల మండలం కల్లూరు బస్టాండు సమీపంలో రెండు దుకాణాల తాళాలు పగులగొట్టి రూ.2,500ల నగదు అపహరించారు. గురువారం నిర్మల్‌లో బంగారం విక్రయించడానికి వచ్చారన్న పక్కా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 2.7 కిలోల వెండి, 17 గ్రాముల బంగారం, రూ.2,500 నగదు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వెండి ఆభరణాలను ‘నిర్మల్ పోలీస్’ అని అందంగా అలంకరించి, తప్పించుకోలేరని ఒక మెసేజ్ ఇచ్చారు. కేసును ఛేదించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, అశోక్, పీసీఆర్ ఎస్సై ప్రదీప్ కుమార్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.