
ఇచ్చోడలో దొంగల బీభత్సం
● ఒకేరోజు మూడిళ్లలో చోరీ ● బంగారం, వెండి, నగదు అపహరణ
ఇచ్చోడ: మండల కేంద్రంలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీకి చెందిన జాదవ్ దేవిదాస్ మూడు రోజుల కిత్రం ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి సొనాల మండలంలోని ఘన్‌పూర్‌కు వెళ్లారు. తాళం పగులగొట్టిన దొంగలు ఇంట్లో చొరబడి తులం బంగారం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు దొంగిలించారు. విద్యానగర్ కాలనీలోని రమేశ్ ఇంట్లో చొరబడి 4 గ్రాముల బంగారంతో పాటు నగదు అపహరించారు. అదేకాలనీలో ఉన్న చిక్రం జంగు ఇంట్లో తులం బంగారం, ఐదు తులాల వెండి దొంగిలించారు. సంతోషిమాత ఆలయం వద్ద పార్క్ చేసిన పల్సర్ 220 బైక్‌ను తీసుకెళ్లి ఆదిలాబాద్ బైపాస్ వద్ద వదిలేసి పరారయ్యారు. అప్రమత్తమైన పోలీసులు క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలను రప్పించి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు.