
● పెద్దపులుల ప్రవేశమార్గంలో తిరిగి పచ్చదనం ● అడవిగా రూప
సాక్షి, ఆసిఫాబాద్: అటవీ, డీఆర్‌డీఏ, సింగరేణి సంస్థలు చేపడుతున్న చర్యలతో అటవీ ప్రాంతాలు పునర్ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. కొన్నేళ్లుగా మైదాన ప్రాంతాలుగా ఉన్న అడవులు పచ్చదనం పరుచుకుంటున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు అడవుల ఖిల్లాగా పేరుంది. అయితే చాలా అటవీ ప్రాంతం అన్యాక్రాంతమైంది. కొంతమంది పోడు వ్యవసాయం పేరిట అడవుల ను ఆక్రమించగా.. మరికొందరు భూస్వాములు గిరిజనుల పేరుతో చెట్లు కొట్టి వ్యవసాయ భూములుగా మార్చారు. సింగరేణి బొగ్గు గనులతో కూడా అడవి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ స మతౌల్యం కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.
ప్రవేశమార్గంలో పచ్చదనం
మహారాష్ట్రలోని తడోబా– అంధారి టైగర్ రిజర్వ్ నుంచి పులులకు సిర్పూర్(టి) అటవీ రేంజ్ పరి ధిలోని ఇటిక్యాలపహాడ్ అటవీ ప్రాంతం కీలకమైన ప్రవేశమార్గంగా ఉంది. ఐదేళ్ల క్రితం వరకు పోడు సాగుతో మైదానంగా మారిన అటవీ ప్రాంతాన్ని అధికారులు దట్టమైన అడవిగా మార్చారు. ఆహార, నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం పులుల నివాసానికి మరింత అనుకూలంగా మారుతోంది. ఇటీవల పులులు ఇక్కడికి వచ్చినట్లుగా పగ్‌మార్కుల ద్వారా అధికారులు నిర్ధారించారు. పర్యవేక్షణ బృందం కదలికలను ట్రాక్ చేస్తోంది.
1000 ఎకరాల్లో చింత, జామ మొక్కలు..
గిరిజనేతర రైతులు పోడు సాగు కోసం పెద్దఎత్తున అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. అటవీ హక్కులను ఉల్లంఘించారు. అయితే కాలక్రమేణా అటవీ అధికారులు, పోలీసులు కలిసి ఆక్రమణకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రారంభంలో ప్రతిఘటించినా.. తర్వాత చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న 1000 ఎకరాల్లో ఐదేళ్లుగా అటవీశాఖ అధికారులు జామ, చింతతోపాటు ఇతర దేశీయ మొక్కలు నాటుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం దట్టమైన అడవిగా రూపాంతరం చెందింది.
డంప్ యార్డులపై పచ్చదనం..
పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ పెద్దపీట వేస్తోంది. ఏటా ఏరియాల వారీగా ఖాళీ స్థలాలు, గనులు, డిపార్టుమెంట్లు, కాలనీల్లో మొక్కలు నాటుతోంది. కొత్త గనుల ఏర్పాటు, విస్తరణ పనులతో చాలా ప్రాంతాల్లో పెద్ద వృక్షాలతోపాటు కొంతమేర అటవీప్రాంతాన్ని కోల్పోవాల్సి వస్తోంది. దానిని భర్తీ చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఖాళీ స్థలాలు వదలకుండా పచ్చదనం పెంపొందిస్తోంది. డీ గ్రేడ్ ఫారెస్టు భూములను అభివృద్ధి చేస్తోంది. మూసివేతకు గురైన ఓసీపీ ప్రదేశాలు, ఓబీ డంపింగ్ యార్డులపై మొక్కలు నాటి పర్యావరణ సమతౌల్యానికి దోహదపడుతోంది. గతంలో నాటిన మొక్కలు ప్రస్తుతం వృక్షాలుగా మారడంతో మూసివేతకు గురైన గనుల ప్రదేశాలు, డంపింగ్ యార్డులు అడవులను తలపిస్తున్నాయి.
1700 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం
ఐదేళ్లలో సుమారు 1700 ఎకరాల అటవీ భూములను స్వాధీనం చేసుకున్నాం. ఇందులో వెయ్యి ఎకరాల్లో స్థానిక జాతుల మొక్కలను నాటాం. 2023– 24లో 200 ఎకరాలు, 2024– 25లో 500 ఎకరాలు.. ఇప్పటివరకు ఇలా మొత్తం 1000 ఎకరాలు తోటలుగా మారాయి. ఐదడుగుల ఎత్తు వరకు మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ ఏడాది 7.47 లక్షలకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 6 లక్షల మొక్కల వరకు నాటాం. మిగిలిన మొక్కలు ఆగస్టు నాటికి నాటుతాం.
– నీరజ్‌కుమార్ టిబ్రేవాల్, డీఎఫ్‌వో
వనమహోత్సవం లక్ష్యం 51 లక్షలు..
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిధిలోని 15 మండలాల్లో జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ, అటవీ, ఇతర శాఖల ఆధ్వర్యంలో ఈ ఏడాది 51 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోనే ఈ ఏడాది 35.20 లక్షల మొక్కలు నాటనున్నారు. గతేడాది 40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 35 లక్షలు మొక్కలు నాటారు. ఈ ఏడాది బెల్లంపల్లి ఏరియా పరిధిలో కై రిగూడ ఓసీపీతోపాటు ఇతర ప్రాంతాల్లోని 40 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు సింగరేణి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఓబీ డంపింగ్ యార్డులతోపాటు సింగరేణి ఉద్యోగుల నివాసం ఉండే కాలనీలు, రహదారుల వెంట నాటనున్నారు.

● పెద్దపులుల ప్రవేశమార్గంలో తిరిగి పచ్చదనం ● అడవిగా రూప

● పెద్దపులుల ప్రవేశమార్గంలో తిరిగి పచ్చదనం ● అడవిగా రూప