ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

Jul 17 2025 3:36 AM | Updated on Jul 17 2025 3:36 AM

ఆదర్శ

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

● కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్పుల రాజేందర్‌ ● ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌కు స్పందన

కాగజ్‌నగర్‌టౌన్‌/కాగజ్‌నగర్‌రూరల్‌: కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కమిషనర్‌ ఎల్పుల రాజేందర్‌ అన్నారు. బుధవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పట్టణవాసులు పలు సమస్యలను కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఓపికగా ఆయన సమాధానాలు ఇస్తూ.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాన రోడ్లపై గుంతలు పూడ్చేందుకు జనరల్‌ ఫండ్‌ నుంచి నిధులు కేటాయించనున్నామని తెలిపారు. ఇటీవల 100 వీధి దీపాలు అమర్చామని పేర్కొన్నారు.

ప్రశ్న: వీధి దీపాలు లేక రాత్రిపూట ఇబ్బంది పడుతున్నాం. పోచమ్మ టెంపుల్‌ సమీపంలో లైట్లు లేక చీకట్లో బయటికి వెళ్లలేకపోతున్నాం. ఓల్డ్‌ కాలనీలో కూడా వీధీదీపాలు లేవు. – మహ్మద్‌ సర్దార్‌, గుంటూరు కాలనీ/ ఆదిల్‌, వార్డు నం 1/ రహెమాన్‌, సర్‌సిల్క్‌ కాలనీ/ కౌశిక్‌ భట్టాచార్య, ఓల్డ్‌ కాలనీ

కమిషనర్‌: రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో వీధిదీపాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: విద్యుత్‌ స్తంభం ఎర్త్‌ వస్తోంది. వర్షాలకు ప్రమాదాలు జరగకముందే మరమ్మతు చేయించాలి. ఇంటి పైనుంచి విద్యుత్‌ తీగలు వెళ్తున్నాయి. – మహ్మద్‌ జాక్‌, విజయబస్తి

కమిషనర్‌: విద్యుత్‌ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం.

ప్రశ్న: చెత్త పేరుకుపోయి అవస్థలకు గురవుతున్నాం. డ్రెయినేజీ నిండి మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. – ప్రసాద్‌, న్యూకాలనీ

కమిషనర్‌: మురుగునీటి కాలువల్లో చెత్తాచెదారం తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: ఇంటి వద్ద డ్రెయినేజీ నిండడంతో మురుగు నీరంతా బావిలోకి చేరుతోంది. నీటిని కనీస అవసరాలను వినియోగించుకోలేకపోతున్నాం.

– పుల్లూరి చందర్‌, బాలాజీనగర్‌

కమిషనర్‌: నాలాల్లో పేరుకుపోయిన చెత్త తొలగిస్తాం. నాలా నుంచి వచ్చే మురుగు నీరు బావిలోకి చేరకుండా చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: వారానికి ఒకసారి మాత్రమే కేరళ పబ్లిక్‌ స్కూల్‌ లైన్‌కు చెత్తబండి వస్తుంది. చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తుంది. ప్రతీరోజు చెత్తబండి వచ్చేలా చూడాలి – సలీం, వార్డు నం.10/ యుసుఫ్‌, వార్డు నం.9

కమిషనర్‌: మున్సిపాలిటీలో చెత్త సేకరణకు 20 ఆటోలు ఉన్నాయి. రెండు పనిచేయడం లేదు. అయినా ప్రతీరోజు అన్ని వార్డుల్లో చెత్త సేకరిస్తున్నాం. చెత్త తీసుకెళ్లేందుకు ప్రతీరోజు వెళ్లాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచిస్తాం.

ప్రశ్న: ఇంటి ముందు ఉన్న ఇంటి స్తంభం ఎప్పుడు విరిగి పడుతుందో తెలియడం లేదు. విరగకముందే చర్యలు చేపట్టాలి. బాలాజీనగర్‌ నుంచి నౌగాం బస్తికి వెళ్లే మార్గంలో ఇంటిని ఆనుకుని విద్యుత్‌ స్తంభం ఉంది. గాలి వీచినప్పుడు వైర్లు తగిలి మంటలు చెలరేగుతున్నాయి. ఇళ్ల వద్ద ఉన్న స్తంభాలు తొలగించాలి. – నదీం ఖాన్‌, నిజాముద్దీన్‌ కాలనీ/ సతీశ్‌, బాలాజీనగర్‌

కమిషనర్‌: విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం.

ప్రశ్న: తమ కాలనీలోకి వింత పురుగులు వచ్చి ఇ బ్బందులకు గురి చేస్తున్నాయి. ఇంట్లోని కర్ర వ స్తువులు తొలుస్తున్నాయి. గతంలో కూడా ము న్సిపల్‌ అధికారులకు వినతి పత్రాలు అందించినా చర్యలు తీసుకోలేదు. అలాగే డ్రెయినేజీలు లేవు. వీధి దీపాలు వెలగడం లేదు. – సాగరిక, గోపాల్‌, కోటేశ్వర్‌, సాయికుమార్‌, కాపువాడ

కమిషనర్‌: ఎస్పీఎం మిల్లు నుంచి పురుగులు వస్తున్నట్లు గుర్తించాం. మిల్లుకు తీసుకువచ్చే కర్ర ద్వారా వచ్చే వీటి నివారణకు త్వరలోనే చర్యలు తీసుకుంటాం. డ్రెయినేజీలో పూడిక తీతతోపాటు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తాం.

ప్రశ్న: తమ ఇంటి నం. 1–16–429/1 వేరే వ్యక్తుల పేరుపై రిజిస్ట్రేషన్‌ అయ్యింది. డుప్లికేట్‌ డాక్యుమెంట్లతో రిజిస్టర్‌ చేయించుకున్నారు. మ్యుటేషన్‌ రద్దు చేయాలి – మహ్మద్‌ ముజాయిద్‌

కమిషనర్‌: రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. పూర్తి వివరాలతో తమను సంప్రదించాలి.

ప్రశ్న: చిన్న వర్షానికే రోడ్డంతా బురదమయంగా మారుతుంది. నడవడానికి కూడా వీలు పడడంలేదు. రాత్రి వేళ వీధిదీపాలు వెలగడం లేదు.

– సువర్ణ, మారుతినగర్‌

కమిషనర్‌: రోడ్ల మరమ్మతు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలో జనరల్‌ ఫండ్‌ ద్వారా రోడ్ల మరమ్మతులు, గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టనున్నాం.

ప్రశ్న: ప్రధాన తాగునీటి పైపులైను లీకేజీ కావడంతో నీరంతా వృథా పోయి రోడ్డు బురదమయంగా మారుతుంది. తాగునీటి కాలుష్యమై రోగాల బారిన పడుతున్నాం. ప్రధాన నాలా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.

– హర్షద్‌, ద్వారకానగర్‌

కమిషనర్‌: పైపులైన్‌కు మరమ్మతు చేపట్టి లీకేజీ అరికడుతాం. డ్రెయినేజీని ఆక్రమించుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: మా కాలనీకి మంజూరైన సీసీరోడ్డు వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే సీసీరోడ్డు వేసి బాధలు తీర్చాలి.

– నేరేళ్ల గోపి, సంజీవయ్య కాలనీ

కమిషనర్‌: రికార్డులు పరిశీలించి సీసీరోడ్డు మంజూరైతే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. లేకుంటే రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తాం.

ప్రశ్న: ఈఎస్‌ఐ గేటు వద్ద చెత్త వేస్తున్నారు. సెప్టిక్‌ ట్యాంక్‌ కూడా ఇదే ప్రాంతంలో క్లీన్‌ చేస్తుండడంతో విపరీతమైన దుర్గంధం వస్తుంది. – కుందారపు రాజు

కమిషనర్‌: ఈఎస్‌ఐ గేటు వద్ద చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటాం. మరోసారి సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ చేస్తే సిబ్బందిపై చర్యలు చేపడుతాం.

ప్రశ్న: డ్రెయినేజీలు లేక మురుగు నీరు రోడ్లపైకి చేరుతుంది. కనీసం నడవలేని పరిస్థితి ఉంది. డ్రెయినేజీ వ్యవస్థ పటిష్టం చేయాలి. – ప్రసాద్‌, కాపువాడ/ వినయ్‌, రాంమందిర్‌ రోడ్‌

కమిషనర్‌: నూతనంగా డ్రెయినేజీలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాం. చెత్త పేరుకపోతే తమ దృష్టికి తీసుకురావాలి.

ప్రశ్న: దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నాం. కాలనీల్లో ఫాగింగ్‌ చేపట్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి.

– రవీందర్‌, శ్రీరాంనగర్‌

కమిషనర్‌: దోమల నివారణకు ఫాగింగ్‌ చేపట్టడంతోపాటు బావుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నీటి తొట్టీల్లో నిల్వ నీటిని ఉంచొద్దు. పరిసరాల పరిశుభ్రత పాటించాలి.

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా1
1/1

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement