
‘జన్‌మన్’తో గిరిజనుల అభివృద్ధి
● కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ● జిల్లాలో విస్తృత పర్యటన
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్/తిర్యాణి/వాంకిడి/: ప్రధానమంత్రి జన్‌మన్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా అన్నారు. రెండోరోజు బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. తిర్యాణి మండలం సుంగాపూర్‌లోని శాటిలైట్ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పీఎం జన్‌మన్ పథకం కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి హాజరయ్యారు. ఆదివాసీ గిరిజనులు గుస్సాడీ నృత్యాలతో స్వాగతం పలికారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. దేవలతలకు పూజలు చేసి, టేకం భీంపటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. పీవీటీజీల కోసం ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పీఎం జీవన జ్యోతి, అటల్ బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ముద్ర రుణాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని సూచించారు. పీఎం జన్‌మన్ కింద పీవీటీజీ గిరిజనులకు 11 రకాల వ్యాధు ల పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు, శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో పీఎం జన్‌మన్ యోజన శిబిరాలు నిర్వహించి ఆధార్ కార్డు ఇప్పించడంతోపాటు బ్యాంకు ఖాతాలు తెరిపించామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ గిరిజనులకు ఆధార్‌కార్డులు, ఉపాధిహామీ జాబ్‌కార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, జన్‌మన్ ఖాతా పుస్తకాలు అందించారు.
మల్టీపర్పస్ కేంద్రం సందర్శన
అనంతరం వాంకిడిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రసూతి వార్డులో బాలింతతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. మండలంలోని లింబుగూడలో పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా రూ.60 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్‌ను సందర్శించారు. గిరిజనులు సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకుంటూ అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో మల్టీపర్పస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు గ్రామంలోని మహాదేవుని ఆలయంలో పూజలు నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి
జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని 140కోట్ల ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో విద్య, వైద్యం, రహదారులతో పాటు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు రూ.1200 కోట్లతో నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మించడంతో పట్టణాలకు కనెక్టివిటీ పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, చెర్ల మురళి, అరిగెల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.