
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
పెంచికల్‌పేట్(సిర్పూర్): మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన అగర్‌గూడకు చెందిన తుమ్మిడే రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ వ్యాపారి కృష్ణ, అతడి సతీమణి వేధింపులతో రాజశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. చట్టంప్రకారం పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. బెయిల్‌పై వచ్చిన నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, పోలీసులు వెంటనే సాక్షుల స్టేట్‌మెంట్ నమోదు చేయాలని సూచించారు. చట్టప్రకారం చర్యలు తీసుకోకుంటే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు షరీఫ్, నవీన్, బాబాజీ, నరేశ్, దేవాజీ తదితరులు పాల్గొన్నారు.
నేడు రౌండ్‌టేబుల్ సమావేశం
కాగజ్‌నగర్‌రూరల్: కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు(జీవో నం. 49) రద్దు చేయాలని గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చాంద్‌పాషా, కోయ సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని విశ్రాంత సంఘ భవనంలో ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి అన్ని సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు.