
సింగరేణి ఇన్‌చార్జిగా కొప్పుల ఈశ్వర్
● టీబీజీకేఎస్ నేతలతో కేటీఆర్ భేటీ
శ్రీరాంపూర్: సింగరేణిలో టీబీజీకేఎస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టీబీజీకేఎస్ నాయకులతో బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై దిశానిర్ధేశం చేశారు. పార్టీ నుంచి సింగరేణికి ఇన్‌చార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో యూనియన్‌కు పూర్వవైభవం తీసుకు రావాలని సూచించారు. ఏ ప్రభుత్వం చేయని మేలును బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికులకు చేసిందన్నారు. సింగరేణి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక హామీలు ఇచ్చి గెలిచాక మోసం చేశారని విమర్శించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని, వారి వైఫల్యాలను ఎత్తి చూపుతూ కార్మిక క్షేత్రాల్లో పోరాడాలని తెలిపారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై బీజేపీ, కాంగ్రెస్ ఒకటే వైఖరి అవలంబిస్తున్నాయని, ఆ పార్టీలు, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను అడ్డుకోవాలని అన్నారు. పోరాటాలు చేయడంలో ఏ సమస్య వచ్చినా కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ లీగల్ సెల్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. త్వరలో సింగరేణిలో పర్యటించి విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పినట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శులు మాదాసు రామ్మూర్తి, కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, సీనియర్ ఉపాధ్యక్షుడు పారుపల్లి రవి, అధికార ప్రతినిధి వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.