
జోరుగా గ్లైఫోసెట్ రవాణా!
● మహారాష్ట్ర నుంచి జిల్లాకు.. ● నిషేధిత గడ్డిమందుతో పర్యావరణానికి ముప్పు ● వానాకాలం సీజన్‌లో విచ్చలవిడిగా వినియోగం
చింతలమానెపల్లి(సిర్పూర్): గ్లైఫోసెట్ మానవాళికే ప్రమాదకరంగా మారిన ఓ గడ్డిమందు. ఈ నాన్ సెలక్టివ్ హెర్బిసైడ్ ద్వారా దుష్పరిణామాలు ఎన్నో ఉన్నా జిల్లాలో చాలామంది విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఈ కలుపు నివారణ మందు మొక్కల్లో ఉండే జీవ ఎంజైమ్‌లను నాశనం చేయడం ద్వారా మొక్కలను ఎదగకుండా చేస్తుంది. మొదట ఓ అమెరికా కంపెనీ రౌండప్ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆ తర్వాత దుష్పరిణామాలను పరిగణనలోకి తీసుకుని చాలా దేశాలు దీనిని నిషేధించడమో.. లేక పరిమితి విధించి నియంత్రించడానికి చట్టాలు రూపొందించాయి.
జిల్లాలో నిషేధం.. మహారాష్ట్రలో అనుమతి
తెలంగాణలో పూర్తిస్థాయి నిషేధం ఉండగా, సరిహద్దులోని మహారాష్ట్రలో నియంత్రణ మాత్రమే ఉంది. అక్కడ అధికారులు సిఫార్సు చేయకుండా వినియోగించే అవకాశం లేదు. రైతులు పత్తి పంటలో కలుపు మొక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు విస్తృతంగా బీటీ 3 విత్తనాలు సాగు చేస్తున్నారు. ఈ విత్తనాలు వాడిన చేలలో గ్లైఫోసెట్ వినియోగించవచ్చు. కలుపు పెరిగినా శ్రమ లేకుండా నివారించవచ్చు. ఈ కారణంతోనే జిల్లాలో బీటీ 3 విత్తనాలు, గ్లైఫోసెట్ గడ్డి మందు వాడుతున్నారు. జిల్లాకు సరిహద్దుగా వాంకిడి, సిర్పూర్(టి), చింతలమానెపల్లి మండలాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అలాగే కొంతమంది రైతులు కూడా మహారాష్ట్రలో కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజూరా, ఆష్టి, గోండ్‌పిప్రి, అహేరి, ఆళ్లపల్లి పట్టణాలోని జి ల్లా రైతులను లక్ష్యంగా చేసుకునే విక్రయాలు జరుపుతున్నారు. వ్యాపారులు మహారాష్ట్రలో లీటర్ రూ.500కు కొనుగోలు చేసి స్థానికంగా రూ.వెయ్యి నుంచి రూ.1200లకు విక్రయిస్తున్నారు. తాజాగా చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద సోమవారం రాత్రి రూ.16వేల విలువైన గ్లైఫోసెట్ మందు, ఖర్జెల్లి శివారులో నిర్వహించిన తనిఖీల్లో రూ. 24వేల విలువైన 30లీటర్ల గ్లైఫోసెట్ గడ్డిమందు లభ్యమైంది. వాంకిడి మండలంలోనూ సోమవారం రాత్రి 40 లీటర్లను పోలీసులు పట్టుకున్నారు.