ఇది ప్రజల ప్రభుత్వం..
ధైర్యంగా ఉండండి
ప్రజా దర్బార్‌లో రాష్ట్ర మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి: ‘ఇది ప్రజల ప్రభుత్వం.. యంత్రాంగమే మీ ముందుకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తోంది.. ప్రతీ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత తీసుకుంటున్నందున ధైర్యంగా ఉండాలి’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి ప్రజల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు పాలేరు నియోజకవర్గంలో ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రతీ మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్ నిర్వహిస్తుండగా ఇప్పటి వరకు పది క్లస్టర్లలో జరిగాయన్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తుండగా, మిగిలిన వాటిని మూడు నెలల్లో పరిష్కరించడమే లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. రాష్ట్రంలోని పేదలందరికీ గూడు సమకూర్చాలనే భావనతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలోనే రెండో విడత ఇళ్ల మంజూరు ఉంటుందని తెలిపారు. రైతుల భూసమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చామని వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలో అన్ని వసతులు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే తన లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ గృహప్రవేశంలో...
నేలకొండపల్లి: నేలకొండపల్లి ఎస్సీ, బీసీ కాలనీలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ గృహ ప్రవేశం బుధవారం జరగగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు అందిమళ్ల నాగరాణి ఇంటిని ప్రారంభించి నూతన వస్త్రాలు అందజేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేర్చిన మంత్రికి రుణపడి ఉంటామని ఆమె తెలిపారు. అలాగే, ఆచార్లగూడెంలో నిర్మించిన ఆలయంలో మంత్రి పూజలు చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడాలి గోవిందరావు, సర్పంచ్ కొలికపొంగు ఉప్పలమ్మతో పాటు నాయకులు పాల్గొన్నారు.


