జిల్లా.. గరం, గరం | - | Sakshi
Sakshi News home page

జిల్లా.. గరం, గరం

May 14 2026 12:37 AM | Updated on May 14 2026 12:37 AM

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతుండడంతో అగ్నిగుండాన్ని తలపిస్తోంది. కొద్ది రోజులుగా 40 – 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, బుధవారం గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 8గంటలకే మొదలవుతున్న ఎండ గంటగంటకు పెరుగుతూ మధ్యాహ్నం వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇక ఉదయం, రాత్రి తేడా లేకుండా ఏసీలు, కూలర్లు వినియోగిస్తుండడంతో విద్యుత్‌ వినియోగం పెరిగి అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. సరఫరాలో ఎలాంటి సమస్య లేదని, విద్యుత్‌ వినియోగం పెరగడంతో అవాంతరాలు వస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు.

తిమ్మారావుపేటలో గరిష్టం

ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో బుధవారం గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, బాణాపురంలో 43.8, గుబ్బగుర్తిలో 43.7, సిరిపురంలో 43.5, పమ్మిలో 43.3, ఏన్కూరులో 43.1, చింతకాని, ఎర్రుపాలెంలో 42.4, పెద్దగోపతిలో 42.2, గౌరారంలో 42.1 ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కల్లూరులో 41.9, నేలకొండపల్లి, ఖమ్మం ఖానాపురం, ప్రకాష్‌నగర్‌ల్లో 41.8, కూసుమంచి, రావినూతలలో 41.7, తల్లాడ, కొణిజర్లలో 41.6, వైరాలో 41.5, వైరాలో 41.4, కుర్నవల్లిలో 41.3, నాగులవంచ, ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద 41.2, మధిర 41.1, పల్లెగూడెం, ముదిగొండలో 41, పెనుబల్లిలో 40.8, బచ్చోడు, తిరుమలాయపాలెంలో 40.7, గేటు కారేపల్లి, మధిరలో 40.6, పంగిడిలో 40.5, లింగాల 40.3, రఘునాథపాలెంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జనానికి అవస్థలు

ఎండ తీవ్రతతో మధ్యాహ్నం వేళ జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. రేకులు, పెంకుటిళ్లలో నివసించేవారే ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా రైతులు, కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు పనుల్లో ఇబ్బంది పడుతున్నారు. ఎండల కారణంగా ఇటీవల వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈనేపథ్యాన నిర్మాణ రంగం. వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనులకు వెళ్లే వారు ఎండ తీవ్రత నేపథ్యాన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత

Advertisement
 
Advertisement
Advertisement