ఖమ్మంవ్యవసాయం: మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నల నిల్వ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాంలే కాక అదనపు గోదాంలను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న నిల్వలను బుధవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాంటాలు కాగానే గోదాంలకు మక్కలు తరలించేలా సరిపడా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ గోదాంలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీం తదితరులు పాల్గొన్నారు.
సాఫీగా ధాన్యం కొనుగోళ్లు
కూసుమంచి: రైతులు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. పాలేరులో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని కాంటా వేసి మిల్లులకు తరలించాలని తెలిపారు. ఆపై ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే రైతులకు సకాలంలో నగదు జమ అవుతుందని చెప్పారు. ఎండల దృష్ట్యా కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సమకూర్చాలని ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ ఇన్‌చార్జి మేనేజర్ సునీల్‌రెడ్డి, డీఆర్‌డీఓ శ్రీరాం, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీ.ఎస్.


