ఖమ్మం ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి.. | - | Sakshi
Sakshi News home page

ఖమ్మం ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి..

May 14 2026 12:37 AM | Updated on May 14 2026 12:37 AM

మంత్రిని కలిసిన

టీజేఏసీ నేతలు

ఖమ్మంఅర్బన్‌: దివంగత సీఎం ఎన్‌టీఆర్‌ ఆశీస్సులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సహకారానికి తోడు ఖమ్మం జిల్లా ప్రజల ప్రేమాభిమానాలతోనే తాను ఈ స్థాయికి చేరానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంత్రిగా తొలిసారి ఆయన ప్రమాణ స్వీకా రం చేసి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం ఖమ్మం డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో తుమ్మల మాట్లాడారు. సామాన్యుడినైన తనకు గత 45 ఏళ్లుగా అవకాశాలు కల్పించిన ప్రజలు, ప్రోత్సహించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు, తాను ఉన్న వ్యవస్థ, నాయకత్వానికి చేదోడుగా నిలుస్తూ, అధికారాన్ని సామాన్యులు, కష్టజీవుల సంక్షేమానికి వినియోగిస్తానని చెప్పారు. నిజాయితీతో కూడిన రాజకీయాలకే తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కాగా, మంత్రి తుమ్మల తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజాసేవే లక్ష్యంగా మంత్రి తుమ్మల పని చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాక సాధారణ రోజుల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కొనియాడారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధికి తుమ్మల కృషి చేశారని తెలిపారు. ఆదివాసీల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ చూపారని చెప్పారు. ఇంకా సభలో వివిధ పార్టీలు, ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు బాగం హేమంతురావు, ఎండీ.సలాం, డాక్టర్‌ వాసిరెడ్డి రామ నాథం, గడిపల్లి కవిత, ఏలూరి శ్రీనివాసరావు, నూతి సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఇంకా కార్యక్రమంలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ అధ్యక్షులు మేళ్లచెరువు వెంకటేశ్వరరావుతో పాటు నాయకులు తుమ్మల యుగంధర్‌, నాగండ్ల దీపక్‌చౌదరి, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, రావూరి సైదబాబు, సాధు రమేశ్‌రెడ్డి, చండ్రా రాంబాబు, గుత్తా వెంకటేశ్వర్లు, యరగర్ల హనుమంతురావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, సంక్రాంతి నాగేశ్వరరావు, దేవ్‌సింగ్‌, దండి సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత నాయకన్‌గూడెం నుంచి సభావేదిక వద్దకు ర్యాలీగా చేరుకోగా, మార్గమధ్యలో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి తుమ్మల పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఖమ్మంసహకారనగర్‌: మంత్రిగా 40 ఏళ్ల ప్రస్థానం పూర్తయిన సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావును టీజేఏసీ బాధ్యులు బుధవారం సన్మానించారు. టీజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఏలూరు శ్రీనివాసరావు, జిల్లా చైర్మన్‌, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదెన శ్రీనివాసరావు, జైపాల్‌, రుక్మారావు తదితరులు పాల్గొన్నారు.

అభినందన సభలో

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Advertisement
 
Advertisement
Advertisement