సీఎం సారూ..
అధ్వానంగా ఆర్‌అండ్‌బీ రహదారులు
మనుగడలోకి రాని ఫుడ్‌పార్క్
నేడు కొత్తగూడెంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
ఇటు చూడరూ!
ఉమ్మడి జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా మారాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు భారీ వాహనాలు ఇక్కడి నుంచే ప్రయాణిస్తుంటాయి. చాలాచోట్ల రహదారులపై గుంతలు ఏర్పడి, కంకర తేలగా ఏటా వర్షాకాలంలో మరమ్మతులకు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదనలు పంపినా నిధులు రావడం లేదు. తల్లాడ–ఖమ్మం, వైరా నుంచి మధిర వెళ్లే రోడ్డు, కొణిజర్ల మండలం పల్లిపాడు– ఏన్కూరు తదితర ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్‌లతోనే సరిపెడుతుండగా కొన్నాళ్లకే పరిస్థితి మొదటికొస్తోంది.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పనుల్లో పురోగతి మందగిస్తోంది. ప్రధానంగా వరప్రదాయినిగా నిలవాల్సిన సీతారామ ప్రాజెక్టు పనులు నిధుల కొరత, భూసేకరణతో ముందుకు సాగడం లేదు. ఇక జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు భారీ వాహనాలు రాకపోకలు సాగించే ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయి. అలాగే, సత్తుపల్లి ప్రాంతంలో నిర్మించిన ఫుడ్‌పార్క్ దశాబ్దాలుగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇవికాక అనేక సమస్యలు తిష్ట వేసినందున మంగళవారం కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సీతారామకు నిధుల కష్టాలు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం మందగించింది. భద్రాద్రి జిల్లాలో మూడు పంపుహౌస్‌లు, 104 కి.మీ. మేర ప్రధాన కాల్వ పూర్తయినా, ఖమ్మం జిల్లాలో ప్రధాన కాల్వ, టన్నెళ్ల తవ్వకంలో జాప్యం నెలకొంది. ఇప్పటి వరకు చేసిన పనులు, భూసేకరణకు సంబంధించి రూ.258.26 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, ఖమ్మం జిల్లాలో ఆరో ప్యాకేజీ మినహా మిగతా ప్యాకేజీలకు అనుమతులు రాలేదు. అంతేకాక సత్తుపల్లి ట్రంక్, పాలేరు లింక్ కెనాల్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు జిల్లాల్లో 1,138.693 ఎకరాల అటవీ భూమి సేకరణకు అడ్డంకులతో పనుల్లో జాప్యం జరుగుతోంది.
అలంకార ప్రాయంగా ఫుడ్‌పార్క్
సత్తుపల్లి నియోజకవర్గంలోని మెగా ఫుడ్‌పార్క్‌కు మోక్షం లభించడం లేదు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన మృతితో ఫుడ్‌పార్క్ మూలన పడింది. ఇక 2017లో ఫుడ్‌పార్క్ అభివృద్ధిపై అప్పటి మంత్రులు కేటీఆర్, తుమ్మల దృష్టి సారించినా పెద్దగా ఫలితం కానరాలేదు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌ను సందర్శించినా కదలిక రాలేదు. 2018లో రెండు కంపెనీలు వచ్చినప్పటికీ పరిశ్రమలు ఏర్పాటుచేయలేదు. భూమి ధర ఎక్కువగా ఉండడం, ఇతర కారణాలతో పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని తెలుస్తుండగా ప్రభుత్వం చొరవ చూపితే ఇటు రైతులు, ఇటు పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడుతుంది.
‘సీతారామ’కు నిధుల కష్టాలు
సీఎం సారూ..


