రెండో దశకు నేటితో తెర
288 నామినేషన్ల తిరస్కరణ
● ఆరు మండలాల్లో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ● మొదటి దశ ఉపసంహరణకు రేపటి వరకు గడువు ● ఉపసంహరణ, ఏకగ్రీవంపై దృష్టి సారించిన పార్టీలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో దశ గ్రామపంచా యతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. జిల్లాలోని ఆరు మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజైన సోమవారం నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపించారు. ఇక మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం వరకు ఉంది. ఈనేపథ్యాన రెబెల్స్‌ను బరిలో నుంచి తప్పించేలా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు యత్నిస్తున్నారు. రెండో విడతలో కూడా ఏకగ్రీవాలపై దృష్టి సారించారు.
రెండో రోజున ఇలా..
కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని 183సర్పంచ్ స్థానాలు, 1,686 వార్డు స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం సర్పంచ్ స్థానాలకు 45, వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయ పాలెం, కామేపల్లి మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 229, వార్డులకు 587నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, ముదిగొండ, కూసుమంచి మండలాల్లో నామినేషన్లపై రాత్రివరకు స్పష్టత రాలేదు. ఇక్కడ నామినేషన్ల స్వీకరణ మంగళవారం ముగియనుండడంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. అత్యధిక సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం చేయాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడి ఆశావహులతో చర్చలు జరుపుతున్నారు. చర్చలు సఫలమైతే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కొక్కటే నామినేషన్ దాఖలవుతుందని.. ఆశావహులు వెనక్కి తగ్గకపోతే పోటీ తప్పదని తెలుస్తోంది.
ఉపసంహరణలపై దృష్టి
మొదటి విడత ఎన్నికలు కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో జరగనుండగా.. కొన్ని గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరికొన్ని చోట్ల ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో గడువు ముగిసే గురువారం నాటికి నామినేషన్లు ఉపసంహరింపచేసేలా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా మరికొన్ని చోట్ల ఏకగ్రీవమయ్యే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉపసంహరణకు అంగీకరించినా, ఇతరుల పోటీతో పోలింగ్ అనివార్యమైతే గెలిచే అభ్యర్థులనే బరిలో ఉంచాలని నేతలు భావిస్తున్నారు.
గ్రామాల్లో ఎన్నికల వార్
గ్రామపంచాయతీల్లో ఎన్నికలతో గ్రామాల్లో వేడి నెలకొంది. స్థానిక అంశాలతో ముడిపడిన ఎన్నికలు కావడంతో ఎక్కడ చూసినా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. బరిలో ఎవరు ఉన్నారు.. ఎవరికి గెలిచే అవకాశం ఉందంటూ చర్చలు జరుపుతున్నారు. కాగా, గ్రామస్థాయిలో పార్టీల ఆధ్వర్యాన అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, రెబెల్స్‌తో మంతనాలు జరుగుతుండగా.. సమస్య పరిష్కారం కాకపోతే మండల, జిల్లాస్థాయి నేతల వద్దకు వెళ్తున్నారు. దీంతో మొదటి, రెండు విడతలు ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో తొలివిడత ఎన్నికల్లో గ్రామపంచాయతీల్లో దాఖలైన నామినేషన్ల పరిశీలన ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. మొదటి విడతగా ఏడు మండలాల్లోని 192 సర్పంచ్ స్థానాలు, 1,740 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా గత నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. వీటిని పరిశీలించగా సరైన ధ్రువపత్రాలు సమర్పించని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అలాగే, కొందరు రెండు, మూడు సెట్లు సమర్పించగా ఒకటి ఆమోదించి మిగతావి తిరస్కరించినట్లు తెలిపారు. మొత్తం సర్పంచ్ స్థానాలకు 1,142 నామినేషన్లు దాఖలు కాగా 215 తిరస్కరించడంతో 927 మిగిలాయి. ఇక 1,740వార్డులకు దాఖలైన 4,054 నామినేషన్లలో 73 తిరస్కరించామని, మిగతా 3,981 మిగిలాయని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ విడతలో నామినేషన్ల ఉపసంహరణకు గురువారం అవకాశం ఉండగా, అదేరోజు సాయంత్రం బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.


