సజావుగా నామినేషన్ల స్వీకరణ
కామేపల్లి/రఘునాథపాలెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగేలా అధికారులు విధులు నిర్వర్తించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కామేపల్లి మండలం కొమ్మినేపల్లిలో సోమవారం నామినేషన్ల స్వీకరణను పరిశీలించిన ఆమె ఉద్యోగులతో మాట్లాడారు. అలాగే, రఘునాథపాలెం జీపలో నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా తయారీని పరిశీలించిన అదనపు కలెక్టర్ గుర్తుల కేటాయింపుపై సూచనలు చేశారు. కామేపల్లి మండల ప్రత్యేకాధికారి మధుసూదన్, ఎంపీడీఓలు రవీందర్, ఆశోక్‌కుమార్, ఎంపీఓ శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శులు శంకర్, ఫజల్, లావణ్య పాల్గొన్నారు.
10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు
ఖమ్మం సహకారనగర్: ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన 10 మంది అధికారులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన శిక్షణకు ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల విధులు కీలకమైనందున హాజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయగా, కఠిన చర్యలు ఎందుకు తీసుకోవద్దో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
ట్రెజరీ శాఖ డీడీగా శ్రీనివాసరెడ్డి
ఖమ్మం సహకారనగర్: హనుమకొండ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్(ఏటీఓ)గా పనిచేస్తున్న వై.శ్రీనివాసరెడ్డిని ఖమ్మం ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో నియమించారు. ఈమేరకు గతనెల 27వ తేదీన ఉత్తర్వులు జారీ కాగా, సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు మహబూబాబాద్ ట్రెజరీ అధికారి వెంటపల్లి సత్యనారాయణ డీడీగా విధులు నిర్వర్తించారు.
22, 23వ తేదీల్లో
జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్?
ఖమ్మం సహకారనగర్: జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌ను ఈనెల 22, 23వ తేదీల్లో నిర్వహించాలని విద్యా శాఖాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత 10, 11, 12వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినా స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో మార్పు చేయనున్నారు. ఈనెల 19నుంచి 24వ తేదీల మధ్య అనువుగా ఉంటుందని భావించిన అధికారులు 22, 23వ తేదీల్లో నిర్వహణకు మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈ విషయమై ప్రైవేట్ విద్యాసంస్థల యజమాన్యాలతో సమావేశం నిర్వహించి ఎగ్జిబిట్ల నమోదుపై చర్చించినట్లు సమాచారం.
‘సీఎం ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పాలి’
ఖమ్మంవైరారోడ్: హామీలు అమలుచేయకపోగా రిజర్వేషన్లలో బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ సూచించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి జరగకపోగా, పంచాయతీ ఎన్నికల వేళ సీఎం పర్యటన పేరుతో ప్రజలపై ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక రెండేళ్లుగా జిల్లాలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు. కాగా, బీసీలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని గమనించి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు బిచ్చల తిరుమలరావు, తాజుద్దీన్, గుండ్లపల్లి శేషు, పగడాల నరేందర్, మక్బూల్, మాటేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సజావుగా నామినేషన్ల స్వీకరణ
సజావుగా నామినేషన్ల స్వీకరణ


