ఆరంభం అదుర్స్ !
● వైరా డిపో నుంచి వైన్స్‌కు భారీగా మద్యం ● రెండురోజుల్లో రూ.33కోట్ల విలువైన మద్యం అమ్మకాలు
వైరా: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా ఉమ్మడి జిలాల్లో వైన్స్ దక్కించుకున్న వ్యాపారులు షాప్‌లను సోమవారం ప్రారంభించారు. ఈమేరకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి మద్యం దిగుమతి చేసుకున్నారు. సోమవారం నుంచి వైన్స్ ప్రారంభం కావాల్సి ఉండగా ఆదివారమే రూ.20 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. ఇందులో 23 వేల కేసుల మద్యం, 9 వేల కేసుల బీర్లు ఉన్నాయి. ఇక సోమవారం 15,600 కేసుల మద్యం, 7,500 కేసుల బీర్లు తీసుకెళ్లగా వీటి విలువ రూ.13.25కోట్లుగా నమోదైందని అధికారులు తెలిపారు. దీంతో రెండు రోజు ల్లోనే వైన్స్ యజమానులు రూ.33.25 కోట్ల విలువైన మద్యం దిగుమతి చేసుకున్నట్లయింది. పంచాయతీ ఎన్నికలతో వైన్స్ ప్రారంభించిన మొదటి నెలలోనే జోరుగా అమ్మకాలు సాగుతాయని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన లిక్కర్ మార్ట్‌లు
ఖమ్మంక్రైం: జిల్లాలోని 116 వైన్స్ షాపులు సోమవారం మొదలుకాగా, ఖమ్మంలో లిక్కర్ మార్ట్‌ల సంఖ్య మూడు నుంచి ఏడుకు చేరింది. ఈ షాప్‌లు రెండేళ్ల పాటు కొనసాగనున్నాయి. కొన్ని వైన్స్‌లు ఏర్పాటుచేసిన షాప్‌ల అద్దె నెలకు రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల వరకు పలికినా వ్యాపారులు వెనక్కి తగ్గనట్లు తెలిసింది. అలాగే, పలు ప్రాంతాల్లో వైన్స్ వద్ద తినుబండారాలు అమ్మే షాప్‌లు దక్కించుకునేందుకు పలువురు కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో పైరవీ చేయించుకున్నట్లు సమాచారం. ఖమ్మం ముస్తఫానగర్‌లోని అల్లీపురం క్రాస్ వద్ద వైన్స్ షాపు ఏర్పాటును స్థానికులు అడ్డుకున్నారు. వీరికి కార్పొరేటర్ పల్లా రోజ్‌లీనా, బీఆర్‌ఎస్ నాయకుడు వెంకన్న తదితరులు మద్దతు తెలిపి మందుబాబుల తీరుతో ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఆరోపించారు. దీంతో వన్‌టౌన్ పోలీసులు వచ్చి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని నచ్చజెప్పడంతో మధ్యాహ్నం 12గంటల తర్వాత షాప్ తెరుచుకుంది.


