‘ఆరోగ్యశ్రీ’లో ఖరీదైన వైద్యం
● గుండె జబ్బు బాధితుడికి పర్మనెంట్ పేస్‌మేకర్ ● జిల్లా పెద్దాస్పత్రిలో తొలిసారి
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారిగా పర్మనెంట్ పేస్‌మేకర్(గుండె లయను నియంత్రించడానికి ఉపయోగించే పరికరం) అమర్చే శస్త్రచికిత్స నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన ఈ చికిత్సతో గుండె సంబంధిత సమస్యతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ప్రాణం నిలబెట్టారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంకు చెందిన డి.వెంకన్న(67) తీవ్రమైన ఆయాసంతో బాధపడుతుండగా కుటుంబీకులు పెద్దాస్పత్రి కార్డియాలజీ విభాగానికి గతనెల 24వ తేదీన తీసుకొచ్చారు. అయితే, ఆరోగ్యవంతులైన వారి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సి ఉండగా, వెంకన్న గుండె 25 సార్లే కొట్టుకుంటున్నట్లు పరీక్షల అనంతరం గుండె వైద్య నిపుణులు డాక్టర్ సీతారామ్ గుర్తించారు. దీంతో తాత్కాలిక పేస్‌మేకర్ అమర్చి అత్యవసర చికిత్స చేసినా, పర్మనెంట్ పేస్‌మేకర్ వేయడానికి అవకాశం లేక మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ దృష్టికి తీసువెళ్లారు. ఆయన చొరవతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వెంకన్నకు క్యాథల్యాబ్‌లో శస్త్ర చికిత్స నిర్వహించి గుండె కుడివైపు పేస్‌మేకర్ పరికరాన్ని అమర్చడంతో ఆయన కోలుకుంటున్నాడు. కాగా, పేస్‌మేకర్ శస్త్రచికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.3.50 లక్షలు వరకు ఖర్చవుతుందని, కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరికరం 12 ఏళ్లపాటు పనిచేస్తుందని, ఆతర్వాత కొత్త బ్యాటరీని అమర్చాల్సి ఉంటుందని వివరించారు. కాగా, శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ సీతారామ్, సహకరించిన మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్, ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్యులు, సిబ్బందికి వెంకన్న కుటుంబీకులు కృతజ్జతలు తెలిపారు.


