కాంగ్రెస్‌తోనే బలహీనవర్గాలకు ప్రాధాన్యత
● డీసీసీ అధ్యక్షుడిగా ‘నూతి’ బాధ్యతల స్వీకరణలో డిప్యూటీ సీఎం భట్టి ● హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల
ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో బలహీన వర్గాలకే ప్రాధాన్యత దక్కుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ బాధ్యతల స్వీకరణ సోమవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. తొలుత శ్రీశ్రీ సర్కిల్ నుంచి భారీ ప్రదర్శనగా జెడ్పీ సెంటర్‌కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నూతి సత్యనారాయణ నివాళులర్పించారు. ఆతర్వాత పువాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఉండి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం, పార్టీ లేదా నామినేటెడ్ రూపంలో పదవులు లభిస్తాయని చెప్పారు. కార్యకర్తల కష్టంతోనే జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలుస్తోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేలా రాజకీయాలు పక్కన పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యాలయానికి త్వరలోనే భూమి పూజ చేస్తామని తెలిపారు.


