పక్కాగా తేల్చేద్దాం
భవనాలు, ఆవరణ కొలతలు సేకరణ సర్వేతో బయటపడుతున్న అదనపు నిర్మాణాలు ప్రతీ ఇంటిని గూగుల్ ఎర్త్‌లో నమోదు చేస్తున్న ఏజెన్సీ
ఇప్పుడు నగరమంతా..
లెక్క..
ఖమ్మంలోని ఓ ఇంటి కొలతలు వేస్తున్న ఏజెన్సీ బృందం
పైలెట్ ప్రాజెక్టుగా..
ఖమ్మంలో పాత నిర్మాణాలపై కొందరు అదనపు నిర్మాణాలు చేపట్టినా కార్పొరేషన్‌కు మాత్రం పాత లెక్కల ఆధారంగా పన్ను చెల్లిస్తున్నారు. దీంతో నిర్మాణాలు పెరిగినా, నగరం విస్తరించినా ఆదాయం రూ.28కోట్ల నుంచి రూ.34 కోట్లు దాటడం లేదు. దీంతో కమిషనర్ అభిషేక్ అగస్త్య, అధికారులు అండర్ అసెస్‌మెంట్ రీ సర్వేనే మార్గమని భావించారు. తొలుత 43వ డివిజన్‌లో పైలట్ ప్రాజెక్టుగా రీ సర్వే చేయిస్తే ఆ డివిజన్‌లోనే వందలాది భవనాల్లో అదనపు నిర్మాణాలు జరిగాయని తేలింది. వీటికి పన్ను విధిస్తే మరో రూ.60లక్షల ఆదాయం అదనంగా వస్తుందని గుర్తించారు. అంతేకాక కొందరు నిర్మాణం ఉన్న కొలతల కన్నా తక్కువగా చూపించి పన్ను తక్కువగా చెల్లిస్తున్నట్లు బయటపడింది. ఈ డివిజన్ 11వ రెవెన్యూ వార్డులో ఉండడంతో ఆ వార్డులోని 42వ డివిజన్ కొంత భాగం, 44, 52 డివిజన్లలో సర్వే చేపట్టగా అదనపు నిర్మాణాలు భారీగానే గుర్తించినట్లు తెలిసింది.
లోపాలు సరిదిద్దడమే లక్ష్యం
అసెస్‌మెంట్ల లెక్కింపులో లోపాలతో పన్నులు పూర్తి స్థాయిలో వసూలు కావడం లేదు. దీన్ని సరిదిద్దడ మే లక్ష్యంగా రీ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లపై సరైన పన్ను అంచనా లేకపోవడం, కొన్ని ఇళ్లలో అదనపు నిర్మాణాలు చేపట్టినా ఒకటే అంతస్తు నమోదు కావడం వంటి లోపాలను సరిది ద్దడం ఈ సర్వేతో సాధ్యమవుతుందని చెబుతున్నా రు. సర్వే నిర్వహిస్తున్న సంస్థ గూగుల్ ఎర్త్ సాంకేతి కతను వినియోగిస్తూ పన్ను మదింపు చేపడుతోంది.
అంతా డిజిటలైజేషన్
సర్వేను అనంత టెక్నాలజీస్ ద్వారా చేపడుతుండగా, క్షేత్రస్థాయిలో కొలతలు తీయడమే కాక గూగుల్ ఎర్త్ ద్వారా తీసిన కొలతలను సరిపోల్చి తుది అంచనాకు వస్తున్నారు. ఆపై డ్యాష్‌బోర్డులో యజమాని పేరు, అసెస్‌మెంట్‌లో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి.. ప్రస్తుతం ఎంత పన్ను కడుతున్నారు. కొత్తగా ఎంత పన్ను కట్టాలనే వివరాలు నమోదవుతున్నాయి. తద్వారా భవనం ఫొటో, ఎన్ని ఫ్లోర్లు, ఎంత విస్తీర్ణంలో ఉందనే వివరాలను అధికారులు కార్యాలయంలో కూర్చుని చూసేలా ఈ సాంకేతికత ఉపయోగపడనుంది.
కేఎంసీకి పెరగనున్న ఆదాయం
నగరంలో లక్షకు పైగా నిర్మాణాలు ఉన్నట్లు అంచనా. వీటికితోడు అదనపు నిర్మాణాలు భారీగానే ఉన్నాయి. అయినా ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం మాత్రం రూ.34కోట్లకు మించి ఉండడం లేదు. ప్రస్తుతం అధికారులు చేయిస్తున్న సర్వేతో ఈ ఆదయం పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు. అధికారికంగా 82 వేల అసెస్‌మెంట్లు ఉండగా.. వీటి సంఖ్య లక్షకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా ఆస్తి పన్ను ఆదాయ లక్ష్యం రూ.45కోట్లకు చేరువయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఫలితంగా కేఎంసీకి ఆదాయం భారీగా పెరుగుతుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కేఎంసీలో వేగంగా అండర్ అసెస్‌మెంట్ రీసర్వే
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20 రెవెన్యూ వార్డులు, వీటి పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. అన్ని చోట్లా అదనపు నిర్మాణాలు భారీగానే ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఈమేరకు 11వ రెవెన్యూ వార్డు మినహా మిగిలిన అన్నిచోట్ల రీసర్వే చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. ఈ ఏజెన్సీ ద్వారా సర్వే చేపడుతుండగా, ఇంటింటికీ వెళ్లి కొలతలు సేకరిస్తున్నాయి. ఇప్పటికే 1, 4, 5, 6వ డివిజన్లలో సర్వే పూర్తికాగా, ప్రస్తుతం 55, 56వ డివిజన్లలో కొనసాగుతోంది.


