దేశానికే తలమానికంగా మహిళా డెయిరీ
డిమాండ్ మేరకు సరఫరా చేసేలా విద్యుత్ వ్యవస్థ
విద్యారంగానికి పెద్ద ఎత్తున
నిధులు వెచ్చిస్తున్నాం..
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ముదిగొండ: మధిర నియోజకవర్గంలో 60వేల మంది మహిళా సభ్యులతో ఏర్పాటవుతున్న ఇందిరా మహిళా డెయిరీ దేశానికి తలమానికంగా నిలవనుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ముదిగొండ మండలం గంధసిరిలో కాకతీయుల నాటి శివాలయం పునర్నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. తొలుత నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని పరిశీలించిన ఆయన.. ఆతర్వాత సభలో మాట్లాడారు.
వారి మాటలు నిజం కాలేదు...
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వారు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రం అంధకారమవుతుందని చెప్పారని డిప్యూటీ సీఎం తెలిపారు. కానీ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా ఇబ్బంది లేకుండా సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పడంతో గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగైందని చెప్పారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశగా 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, దశల వారీగా బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. అలాగే, విద్యార్థుల మెస్ చార్జీలు, కాసొటిక్స్ చార్జీలు పెంచామని, ప్రతీ బిడ్డ ప్రపంచంతో పోటీపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే బోనకల్ మండలం లక్ష్మీపురం నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయని తెలిపారు.
ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ఇందిరా మహిళా డెయిరీ ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. గంధసిరిలో గురువారం ఆయన జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. మహిళా డెయిరీలో భాగంగా మొదటి విడతగా గేదెల పంపిణీ పూర్తయినందున పశుగ్రాసం సరఫరాపై దృష్టి సారించాలని తెలిపారు. గేదెల సంరక్షణకు షెడ్ల నిర్మాణం, వాటిపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఈఓ చైతన్య జైనీ, డీఏఓ పుల్లయ్య, పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు, డీఐఈఓ రవిబాబు, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, సొసైటీల చైర్మన్లు సామినేని వెంకటేశ్వరరావు, తుపాకుల ఎలుగొండ స్వామి, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కొమ్మినేని రమేష్‌బాబు, నాయకులు ప్రదీప్తచక్రవర్తి, భద్రారెడ్డి, నాగేశ్వరరావు, పి.దేవేంద్రం, బిక్షం, మట్ట రవీందర్‌రెడ్డి, బాబురాంరెడ్డి పాల్గొన్నారు.
మాట మేరకు ఇందిరమ్మ ఇల్లు
దశాబ్ద కాలంగా నిరీక్షించగా.. తమ కల ఇప్పుడు నెరవేరిందని గంధసిరికి చెందిన పెనుగొండ శివకృష్ణ – నాగమణి తెలిపారు. ఎన్నికలకు ముందు భట్టి విక్రమార్క చేపట్టిన నాడు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో వీరికి ఇళ్లు లేదని చెప్పడంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు శివకృష్ణ దంపతులకు మంజూరైన ఇంటి నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఆయనకు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.
దేశానికే తలమానికంగా మహిళా డెయిరీ


