మీ పిల్లలు ఎలా చదువుతున్నారు?
అన్ని పాఠశాలల్లో నిర్వహణ
● నేడు పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు ● హాజరుకావాలని తల్లిదండ్రులకు లేఖలు
ఖమ్మం సహకారనగర్: విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేసేలా ప్రతీనెల మూడో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ – టీచర్స్ మీటింగ్ (పీటీఎం)లు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ సమావేశాలకు తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కానరావడం లేదు. ఈ నేపథ్యాన ఈసారి జరిగే సమావేశానికి తల్లిదండ్రులు తప్పక హాజరయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతీనెలా మూడో శనివారం సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఈసారి బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారమే నిర్వహించనున్నారు. ఈమేరకు తల్లిదండ్రులకు ఆహ్వానాలు సైతం పంపించారు.
66వేల మంది విద్యార్థులు
జిల్లాలోని 1,217 ప్రభుత్వ పాఠశాలలు, 14 కేజీబీవీలు, రెండు మోడల్ స్కూళ్లు ఉండగా, సుమారు 66వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించే పీటీఎంల కార్యాచరణను ప్రభుత్వం విడుదల చేసింది. సమావేశాలకు హాజరయ్యే తల్లిదండ్రులను తరగతి గదుల్లో కూర్చోబెట్టి అక్కడ జరుగుతున్న బోధనపై అవగాహన కల్పిస్తారు. అలాగే, పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా పోస్టర్ల ఆధారంగా సూచనలు చేయనున్నారు.
ఉద్దేశం ఇదే..
విద్యార్థులతో తల్లిదండ్రులు కనీస సమయం కేటాయించడంతో పాటు కోపంగా కాకుండా ప్రశాంతంగా మాట్లాడేలా ఉపాధ్యాయులు సూచనలు చేస్తారు. అంతేకాక చిన్నచిన్న విజయాలకు పిల్లలను అభినందించడం, అప్పుడప్పుడు బహుమతులు ఇస్తూ చదువుతో పాటు ఆటలు ఆడుకునే అవకాశాన్ని కల్పించేలా అవగాహన కల్పిస్తారు. అంతేకాక క్రీడలు, నృత్య ప్రదర్శన, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతపై చర్చిస్తారు. కాగా, సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు అభిప్రాయాలను నమోదు చేసి ఆ వివరాలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో ఫొటోలతో సహా అప్‌లోడ్ చేయాల్సి ఉంది. కాగా, అంశాల వారీగా గంట 40 నిమిషాల పాటు సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పీటీఎం నిర్వహించనున్నాం. ఇప్పటికే ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులకు ఆహ్వానపత్రికలు పంపించాం. ఈ సమావేశాల్లో విద్యార్థుల ప్రగతిని వివరించడమే కాక ఆనందకరమైన బాల్యాన్ని అందించేలా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తారు.
– బాబోజు ప్రవీణ్‌కుమార్, విద్యాశాఖ సీఎంఓ
మీ పిల్లలు ఎలా చదువుతున్నారు?


