పేదలకు అండగా పాలన
● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేలకొండపల్లి: రాష్ట్రంలో నిరుపేదలకు అండగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేలకొండపల్లి మండలంలోని మంగాపురంతండాలో రూ.30 లక్షలు, బుద్ధారంలో రూ.15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. అలాగే, నేలకొండపల్లి తహసీల్‌లో 58 మందికి రూ.20.29 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించాక మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుల పంట రుణాలు పూర్తిగా మాఫీ చేశామని తెలిపారు. అంతేకాక ధాన్యం పండించిన రైతులకు మద్దతు ధరతో సన్నధాన్యానికి బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, నూతన రేషన్‌కార్డుల జారీ చేయడమే కాక అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలి
కూసుమంచి: విద్యార్థులకు మెరుగైన బోధన చేయడం ద్వారా వారిలో నైపుణ్యాలు పెంపొందించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కూసుమంచిలోని ప్రభుత్వఉన్నత పాఠశాలలో ఇన్‌స్పైర్ అండ్ ఇగ్నైట్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఏర్పాటుచేసిన వ్యక్తిగత నైపుణ్యాభివృద్ధి సదస్సులో మంత్రి మాట్లాడారు. విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని సూచించారు. చెడు వ్యసనాల బారిన పడకుండా శ్రద్ధగా చదివితే ఉన్నత స్థానాలకు చేరొచ్చని తెలిపారు. కాగా, ఇగ్నైట్ ఫౌండేషన్ రంజిత్ ఆధ్వర్యాన చేపడుతున్న ఈ కార్యక్రమాలు రాష్ట్రమంతా నిర్వహించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యువత మంచి మార్గాన్ని ఎంచుకునేలా ఇలాంటి సదస్సులు దోహదం చేస్తాయన్నారు. అనంతరం పీఎస్‌ఆర్ ట్రస్ట్ ద్వారా జూనియర్ కళాశాలలో 34 మంది విద్యార్థినులకు మంత్రి సైకిళ్లు అందజేశారు. ఈకార్యక్రమాల్లో నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఎంఈఓ రాయల శేషగిరి, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, వెంకన్న, బచ్చలకూరి నాగరాజు, ధీరావత్ రాధాకృష్ణమూర్తి, నల్లాని మల్లికార్జున్‌రావు, భద్రయ్య, అంజిని, గోబ్రియా నాయక్, కడియాల నరేష్, పాకనాటి కన్నారెడ్డి, కొమ్మినేని విజయ్‌బాబు పాల్గొన్నారు.
పేదలకు అండగా పాలన


