పీహెచ్‌సీల్లో ప్రసవాలపై ప్రత్యేక దృష్టి
● వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి ● డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన రామారావు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనాలకోట రామారావు తెలిపారు. డీఎంహెచ్‌ఓగా గురువారం బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సిజేరియన్లు తగ్గేలా గర్భిణుల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇదే సమయాన ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్ల సంఖ్య తగ్గించాలని ఆదేశించారు. అలాగే, చిన్నారుల వ్యాక్సినేషన్ పకడ్బందీగా నిర్వహిస్తామని, ఎన్‌సీడీ కార్యక్రమం ద్వారా వ్యాధులు ఉన్నట్లు గుర్తించిన వారికి మందులు సరఫరా చేస్తామని చెప్పారు. సికిల్‌సెల్ బాధితులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాగా, పల్లె దవాఖానాల్లో పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బంది నియామకం, పీహెచ్‌సీలకు డేటా ఎంట్రీ ఆపరేటర్ల కేటాయింపుపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. అంతేకాక అన్ని పీహెచ్‌సీలు, పల్లెదవాఖానాలు, సబ్‌సెంటర్లలో బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేయనుండగా, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. కాగా, డీఎంహెచ్‌ఓ బాధ్యతల స్వీకరణకు ముందు రామారావు కలెక్టర్ అనుదీప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
పీహెచ్‌సీలో తనిఖీ
కొణిజర్ల: కొణిజర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ రామారావు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫార్మసీ స్టోర్, స్టాక్ రిజిస్టర్ పరిశీలించడంతో పాటు ల్యాబ్‌లో జరుగుతున్న పరీక్షలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కొణిజర్ల వచ్చిన రామారావును ఉద్యోగులు సత్కరించారు. డాక్టర్ శారద, సిబ్బంది పాల్గొన్నారు.


