‘తీపి’ బాధ పెరుగుతోంది.. | - | Sakshi
Sakshi News home page

‘తీపి’ బాధ పెరుగుతోంది..

Nov 14 2025 8:03 AM | Updated on Nov 14 2025 8:03 AM

‘తీపి

‘తీపి’ బాధ పెరుగుతోంది..

● జిల్లాలో పెరుగుతున్న షుగర్‌ బాధితులు ● ఎన్‌సీడీ ద్వారా గుర్తించిన కేసులు 55,829 ● జీవన శైలిలో మార్పులే కారణం అంటున్న వైద్యులు

వ్యాధిగ్రస్తుల గుర్తింపు, అవగాహన

ఇవీ లక్షణాలు

● జిల్లాలో పెరుగుతున్న షుగర్‌ బాధితులు ● ఎన్‌సీడీ ద్వారా గుర్తించిన కేసులు 55,829 ● జీవన శైలిలో మార్పులే కారణం అంటున్న వైద్యులు
నేడు ప్రపంచ డయాబెటిస్‌ డే

ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో షుగర్‌ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. సరైన శారీరక శ్రమ లేకపోవటం, జీవన శైలిలో మార్పుల మూలంగా షుగర్‌ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే వ్యాధి మరింత విస్తరించే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్‌ వ్యాధి నియంత్రణ కోసం కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఫ్రెడరిక్‌ బాంటింగ్‌ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన నవంబర్‌ 14న ఏటా ప్రపంచ డయాబెటిస్‌ డేగా జరుపుకుంటున్నారు. జిల్లాలో పరిస్థితులపై కథనం.

పెను భూతంలా విస్తరిస్తూ..

మధుమేహం (డయాబెటిస్‌) వ్యాధికి సైలెంట్‌ కిల్లర్‌ అని పేరుంది. ముందస్తు లక్షణాలు లేకుండానే డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. ఇతర సమస్యలు చుట్టుముట్టే వరకు కూడా సగం మందికి పైగా తాము ఈ వ్యాధి బారిన పడిన విషయం కూడా తెలియడం లేదని వైద్యులు చెబుతున్నారు. సాధారణ రక్త పరీక్షల ద్వారా ముందస్తుగా గుర్తించి సకాలంలో వైద్యం తీసుకోవడమే ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. మానవ రక్తంలో అధిక మోతాదులో చక్కెర నేరుగా కలవటం వల్ల రోగనిరోధక వ్యవస్ధ దెబ్బతినండం జరుగుతుంది. ఈ వ్యాధి అరికాళ్లు, కంటి నరాలు, గుండె, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

జిల్లాలో 55,829 మంది..

జిల్లాలో చిన్నాపెద్దా, లింగ భేదంతో తేడాలేకుండా వ్యాధి బారిన పడేవారు ఎక్కువ అవుతున్నారు. జీవన శైలిలో మార్పు, శారీరక శ్రమ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బీపీ, షుగర్‌ వ్యాధుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం 2018లో నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీస్‌ (ఎన్‌సీడీ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. 30 ఏళ్లు పైబడిన రక్తపోటు, మధుమేహానికి గురైన వారిని గుర్తించి, ముందస్తుగా వారికి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో 55,829 మంది షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించగా.. గుర్తించని కేసులు ఎక్కువగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా, వీరిలో 35,797 మంది ఎన్‌సీడీ ద్వారా అందించే మందులు తీసుకుంటుండగా, మిగతా వారు ప్రైవేట్‌లో వాడుతున్నారు.

ఎన్‌సీడీ కార్యక్రమం ద్వారా షుగర్‌ వ్యాధిగ్రస్తులను గుర్తించడమే కాక ఎన్‌సీడీ కార్నర్లు, క్లినిక్‌ల ద్వారా బాధితులకు మందులు అందిస్తున్నాం. అంతేకాక వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలపై ప్రచారం చేస్తున్నాం. ప్రతీ ఒక్కరూ తగిన శారీరక వ్యాయామం చేయడంతో పాటు జంక్‌ఫుడ్‌ జోలికి వెళ్లొద్దు. రెండు, మూడు నెలలకు పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడితే షుగర్‌, బీపీ నియంత్రణలో ఉంటాయి. –డి.రామారావు,

డీఎంహెచ్‌ఓ, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి

శరీరంలో ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ పనిచేయక పోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయి పెరగడమే మధుమేహం. మధుమేహం టైప్‌–1, టైప్‌–2 రకాలు ఉంటాయి. టైప్‌–1 సాధారణంగా చిన్న వయస్సులో వస్తుంది. పూర్తిగా శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి జరగకపోవటంతో, బయటి ఇన్సులిన్‌ మీద ఆధారపడాల్సి వస్తుంది. టైప్‌–2 వ్యాధి ఇన్సులిన్‌ ఉత్పత్తి ఉంటుంది కానీ కావాల్సిన మోతాదులో ఉండకపోవడం.. వినియోగం సరిగ్గా ఉండకపోవడంతో వస్తుంది. చాలామందిలో ఈ రకమే కనిపిస్తోంది. తొలి దశలో వారికి తరచూ దాహం వేయడం, ఆకలి ఎక్కువ కావటం, పదే పదే మూత్రం రావటం, నీరసం, మానని గాయాలు, కాళ్లలో తిమ్మిర్లు, చూపు మందగించటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందికి ఏ లక్షణం లేకున్నా వ్యాధి ఉండే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకరమైన ఆహర పదార్థాల వినియోగం పెరగడం మధుమేహానికి దారితీస్తుంది.

‘తీపి’ బాధ పెరుగుతోంది..1
1/2

‘తీపి’ బాధ పెరుగుతోంది..

‘తీపి’ బాధ పెరుగుతోంది..2
2/2

‘తీపి’ బాధ పెరుగుతోంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement