అనుమతి లేకుండా బయటకు పంపిస్తే చర్యలు
నేలకొండపల్లి: డీఈఓ అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను బయటకు తీసుకెళ్తే ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. కొందరు హెచ్‌ఎంలు అనుమతి తీసుకోకుండా వివిధ పనుల నిమిత్తం విద్యార్థులను బయటకు పంపిస్తున్నట్లు తేలడంతో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల ప్రాంగణం నుంచి విద్యార్థులను బయటకు పంపాలన్నా, వారిని వెంట తీసుకెళ్లాలన్నా డీఈఓ అనుమతి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ పేరిట ఉత్తర్వులు విడుదలయ్యాయి.
15, 16వ తేదీల్లో
టీ.టీ. జట్ల ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లాస్థాయి టేబుట్ టెన్నిస్ జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్‌కుమార్, వీవీఎస్ మూర్తి తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అండర్–11, 13, 15, 17, 19తో పాటు సీనియర్స్ మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఎంట్రీలను ఈ నెల 14వ తేదీలోపు అందజేయాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే సమయాన వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాలని, ఇక్కడ ఎంపిక చేసే జట్లు ఈ నెల 28 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ఆలయ భూములకు హద్దుల ఏర్పాటు
ఎర్రుపాలెం: జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి నర్సింహాపురంలోని సర్వే నంబర్ 421లో 10.23 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొంత భూమిని పరిసర ప్రాంత రైతులు ఇటీవల ఆక్రమించగా నోటీసులు ఇచ్చారు. ఆపై ఆలయ ఈఓ కె.జగన్‌మోహన్‌రావు పర్యవేక్షణలో గురువారం సర్వేయర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యాన సర్వే చేసి హద్దులు నిర్ధారించారు. రెండెకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు తేలడంతో స్వాధీనం చేసుకుని హద్దురాళ్లు పాతడంతోపాటు మొక్కలు నాటించారు.
17న తేలనున్న
‘మోంథా’ నష్టం లెక్క
ఖమ్మంవ్యవసాయం: మోంథా తుపాన్‌తో జిల్లాలో దెబ్బతిన్న పంటల లెక్కలు ఈ నెల 17వ తేదీతో తేలనున్నాయి. గతనెల 29, 30వ తేదీల్లో మోంథా తుపాన్ ప్రభావం జిల్లాపై పడగా చేతికందే దశలో ఉన్న వరి, పత్తితో పాటు కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో 43,104 మంది రైతులకు చెందిన 62,400 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదిక అందించాయి. దీంతో సమగ్ర సర్వే చేయాలనే ఆదేశాలు రావడంతో 33 శాతం జరిగిన పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని నివేదిక సమర్పించారు. అయితే, కొందరు రైతులు తమ పంటలకు నష్టం జరిగినా పరిహారానికి సిఫారసు చేయకపోవడంతో అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఈమేరకు నివేదికలను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించాలని గురువారం ఆదేశించింది. ఈ నివేదికలపై రైతులు ఫిర్యాదు చేస్తే పరిశీలించి ఈనెల 17 నాటికి తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. తద్వారా పంట నష్టంపై స్పష్టం రానుంది. అయితే, జాబితాలను బహిరంగంగా ప్రదర్శిస్తే తమపై రాజకీయ ఒత్తిడి వస్తుందని ఏఈఓలు వాపోతున్నారు.
వేర్వేరు ప్రాంతాల్లో
ఇద్దరి ఆత్మహత్య
ఖమ్మం అర్బన్: ఖమ్మం అర్బన్ పోలీసుస్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం వైఎస్సార్ కాలనీకి చెందిన విద్యార్థిని మంచికంటి తేజశ్రీ(24) ఎన్నిసార్లు పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే, దానవాయిగూడెంకు చెందిన కార్మికుడు షేక్ యాకూబ్(33) అనారోగ్యంతో బాధపడుతూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్డప్డాడు. వీరి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. ఇక చింతకాని మండలం నేరడకు చెందిన కేతబోయిన కావ్య(22) ఖమ్మం బల్లేపల్లిలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో పనిచేస్తూ వసతిగృహంలో ఉంటోంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆమె ఈనెల 5న పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
అనుమతి లేకుండా బయటకు పంపిస్తే చర్యలు


