పరిహాసమేనా ?
33 శాతం పైగా పంట దెబ్బతింటేనే అర్హత గతంలో నష్టపోయిన రైతులకు ఇంకా అందని వైనం ‘మోంథా’తో జిల్లాలో 62వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
ఆ పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు..
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఈసారీ..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తుపాన్లు, వర్షాలతో పంటలు దెబ్బతిన్న సమయాన ప్రభుత్వం ప్రకటించే పరిహారం, విధించే నిబంధనలు అపహాస్యం చేసేలా ఉంటున్నాయనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. గత ఏడాది వర్షాలతో నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించినా చాలామందికి నేటికీ అందలేదు. ఎకరం పత్తి సాగుకు రూ.40వేలు, వరి సాగుకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇలా రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నెలల తరబడి శ్రమిస్తే పంట విపత్తులతో నేలమట్టం అవుతోంది. ఈ సమయాన ప్రభుత్వం ఎకరాకు అందించే రూ.10 వేల పరిహారం ఏ మూలకు సరిపోవడం లేదని అన్నదాతలు చెబుతున్నారు. ఇప్పుడు రైతులకు పరిహారం ప్రకటించినా పంట నష్టం 33 శాతానికి పైగా ఉంటేనే చెల్లిస్తామనే నిబంధనతో చిన్న, సన్నకారు రైతులకు న్యాయం జరగదనే భావన వ్యక్తమవుతోంది.
నేలవాలుతున్న ఆశలు
శ్రమకోర్చి, పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసే రైతులు ప్రభుత్వం చెల్లించే అరకొర పరిహారానికి సైతం ఎదురుచూడాల్సి వస్తోంది. గత రెండేళ్లుగా పంటల సీజన్ ప్రారంభంలో అనావృష్టి, చేతికి వచ్చే సమయంలో అతివృష్టి దెబ్బతీస్తోంది. వరి పంట నేలవాలడంతో దిగుబడి తగ్గుతుండగా, పత్తి తడిసి చేన్లలోనే నీరు కారుతోంది. ఫలితంగా వచ్చే తక్కువ పంటకు కూడా మద్దతు ధర దక్కక తీరని నష్టం ఎదురవుతోంది.
109 మంది రైతులకు ఇంకా బకాయి
గత ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1న వచ్చిన తుపాను ధాటికి జిల్లాలో మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారం ప్రకటించింది. జిల్లాలో 27,693 మంది రైతులకు చెందిన 28,322.34 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక సమర్పించారు. వీరిలో మొదటి దఫా 27,536 మందికి 28,124.29 ఎకరాలకు రూ.28,12,47,250, రెండో విడతలో 48 మంది రైతులకు సంబంధించి 43.09 ఎకరాలకు రూ.43,225 అందాయి. మూడో విడతగా 109 మంది రైతులకు 154.36 ఎకరాలకు సంబంధించి రూ.1,54,09,000 పరిహారం నేటికీ జమ కాలేదు.
‘యాసంగి’ లెక్కే లేదు..
ఈ ఏడాది ఏప్రిల్, మే యాసంగి సీజన్‌లో అకాల వర్షాలు పంటలకు నష్టం కలిగించాయి. జిల్లాలో 332 మంది రైతులకు సంబంధించి 548 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు తేల్చినా ఇప్పటికీ పరిహారం అందలేదు. ఈ ఏడాది ఆగస్టులో భారీ వర్షాలతో 3,635 మంది రైతులు పెసరతోపాటు మొక్కజొన్న, ఇతర పంటలు 4,654 ఎకరాల్లో నష్టపోతే ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. ప్రస్తుతం మోంథా తుపానుతో 62,400 ఎకరాల్లో నష్టం జరగగా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల పరిహారమే ప్రకటించడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాక 33 శాతం నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన సడలించడమే కాక రైతులను ఆదుకునేలా ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరుతున్నారు.
పంట నష్టం రూ.లక్షల్లో.. పరిహారం రూ.వేలల్లో
ఆరు ఎకరాల్లో సాగు చేశాను. వరి కోద్దామని మిషన్ మాట్లాడేలోగా తుపాన్‌తో నేలవాలింది. ఫలితంగా ఎకరాకు రూ.50 వేల వరకు నష్టపోయా. గత ఏడాది ఆరెకరాల్లో పంట మునిగిపోతే ప్రభుత్వ పరిహారం ఇప్పటికీ రాలేదు.
– యాసా సత్యనారాయణరెడ్డి, రాజుపేట
నాలుగెకరాల్లో పత్తి, ఎకరంలో వరి సాగుకు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టా. పత్తి తీసే సమయానికి తుపాను దెబ్బతీసింది. పత్తి ముద్దయి, మొలకలు వస్తున్నాయి. వరి నేలవాలింది. ప్రభుత్వమే సరైన పరిహారం చెల్లించి ఆదుకోవాలి.
– ఊడుగుల శ్రీనివాస్, పిండిప్రోలు
పరిహాసమేనా ?
పరిహాసమేనా ?
పరిహాసమేనా ?


