నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Nov 2 2025 9:28 AM | Updated on Nov 2 2025 9:28 AM

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌/నేలకొండపల్లి: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాల శాఖ ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. కూసుమంచి మండలంలోని జక్కేపల్లి, నేలకొండపల్లి మండలంలోని ఆరెగూడెంలో మోంథా తుపాన్‌ తాకిడికి దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలిస్తారు. అలాగే, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కేబీఆర్‌.నగర్‌లో పర్యటించి వరదలతో నీట మునిగిన ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శిస్తారు. అంతేకాక ఖమ్మంరూరల్‌ మండలంలోని కామంచికల్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పలు ప్రైవేట్‌ కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు.

సెలవులో కలెక్టర్‌ అనుదీప్‌

ఖమ్మం సహకారనగర్‌: కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి వ్యక్తిగత సెలవులో వెళ్తున్నారు. ఈ నెల 2వ తేదీ(ఆదివారం) నుంచి వారం పాటు ఆయన సెలవులో ఉంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తిరిగి కలెక్టర్‌ 10వ తేదీన విధుల్లో చేరతారు. అప్పటి వరకు అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

11న జిల్లాస్థాయి

యువజనోత్సవాలు

ఖమ్మం రాపర్తినగర్‌: ఖమ్మంలోని భక్తరామదాసు కళా క్షేత్రంలో ఈనెల 11న జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజనోత్సవాలు నిర్వహిస్తుండగా, జానపద నృత్యం, జానపదగేయాలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, పోస్టర్‌ పెయింటింగ్‌, కవిత్వం తదితర అంశాల్లో పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 15 – 29 ఏళ్లలోపు వారు అర్హులని, జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయికి, ఆ ఆర్వాత జాతీయస్థాయి యువజనోత్సవాలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఎంట్రీలను ఈనెల 10వ తేదీలోగా అందజేయాలని, వివరాలకు సర్దార్‌ పటేల్‌ స్టేడియంలోని తమ కార్యాలయంలో కానీ 9948207271 నంబర్‌లో కానీ సంప్రదించాలని డీవైఎస్‌ఓ సూచించారు.

స్కాలర్‌షిప్‌ దరఖాస్తుల్లో లోపాలను సరిచేయాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కోసం అందిన దరఖాస్తుల్లో లోపాలను సోమవారం లోగా సరిచేయాలని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి జి.జ్యోతి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరులో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు అందాయని తెలిపారు. ఈమేరకు ఆధార్‌ నంబర్‌ బ్యాంకు ఖాతాకు లింక్‌ లేకపోవడం, కాలేజీలో పరిశీలన పూర్తికాకపోవడం వంటి సమస్యలపై ప్రిన్సిపాళ్లు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఒకవేళ బ్యాంకు ఖాతాలో సమస్యలు ఉంటే పోస్టాఫీస్‌లో ఖాతా తెరిపించి పూర్తి వివరాలను జిల్లా కార్యాలయానికి డిజిటల్‌ కీ ద్వారా సమర్పించాలని సూచించారు.

సత్యనారాయణ స్వామి వ్రతంలో 52జంటలు

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. అంతేకాక కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా 52జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. ఈఓ జగన్మోహన్‌రావు, చైర్మన్‌ శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్‌ విజయకుమారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

నీలాద్రీశ్వరుడికి అన్నాభిషేకం

సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం పరిధిలోని నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ కోనేటిలో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా, శనివారం తెల్లవారుజామున 4గంటల నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యాన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement