
సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, జిల్లా అటవీ అధికారి
ఏటా కొత్తగా అటవీ ప్లాంటేషన్లు
మొక్కల సంరక్షణకు ప్రత్యేక నిధులు
ఉద్యాన యోజన పథకం కింద అర్బన్ ఫారెస్ట్ అభివృద్ధి
అటవీ ప్రాంతంలో.. రాష్ట్రంలో అటవీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం ముందు వరసలో నిలుస్తుంది. భౌగోళికంగా చూస్తే జిల్లా విస్తీర్ణంలో నాలుగు శాతం(62,115 హెక్టార్లు) అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ చల్ల, దుబ్బ, నల్ల నేలలు వృక్ష సంపద, జంతుజాలానికి అనుకూలంగా ఉండడం కలిసొస్తోంది. అలాగే, రెండేళ్లుగా వన మహోత్సవం కార్యక్రమం కింద అటవీ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సగటున ఏటా 5లక్షల మొక్కలను బ్లాక్ ప్లాంటేషన్ పేరిట అటవీ భూముల్లో నాటి సంరక్షిస్తుండడంతో పచ్చదనం, అటవీ విస్తీర్ణం పెరుగుతోంది. ఖమ్మం అటవీ సర్కిల్ పరిధిలోని ఖమ్మం, సత్తుపల్లి డివిజన్లలో 2024–25లో 7.60 లక్షల మొక్కలు నాటగా, ఈ ఏడాది 5.47 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమైంది. ఇందులో ఖమ్మం డివిజన్‌లో 2.47 లక్షలు, సత్తుపల్లి డివిజన్‌లో 3లక్షల మొక్కలు నాటనున్నారు.
ప్రత్యేక నిధులతో అడుగులు
నూతన అడవుల పెంపకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. కొత్త అడవుల పెంపకం, అటవీ భూముల పరిరక్షణ, అభివృద్ధికి క్యాంప్ (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ అథారిటీ) పథకాన్ని వినియోగిస్తున్నారు. అలాగే, పోడు, ఇతర కారణాలతో నరికేసిన అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, అటవీ భూములను అభివృద్ధి చేసేందుకు అటవీ నిధుల పథకాన్ని అమలు చేస్తున్నారు. అంతేకాక క్షీణించిన అటవీ భూముల అభివృద్ధికి డీఎఫ్‌ఎల్(డీ గ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్) పథకం అమల్లో ఉంది. కాగా, బ్లాక్ ప్లాంటేషన్లలో నాటే మొక్కల సంరక్షణకు వాచర్ల నియామకం, ఎక్కడైనా మొక్కలు చనిపోతే కొత్తవి నాటుతుండడంతో 90–92 శాతం బతుకుతుండగా పచ్చదనం పెరుగుతోంది.
లంకపల్లి.. భేష్
సత్తుపల్లి అటవీ డివిజన్ లంకపల్లి రిజర్వ్ ఫారెస్టు పరిధి కనిగిరి కొండల్లో ఉన్న పులిగుండాల ప్రాజెక్టు వద్ద సైతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణతో పాటు దట్టమైన అడవుల పెంపకం కొనసాగుతోంది. రిజర్వ్ ఫారెస్టులోని గొల్లగూడెం 182 కంపార్ట్‌మెంట్లలో 2023–24లో 14 హెక్టార్లలో 15,554 నేరేడు, తెల్లమద్ది, నల్లచందుగ, ఉసిరి, వెదురు, ఇరికి మొక్కలు ఇందులో 2024–25 నాటికి 14,667 మొక్కలు(94.30 శాతం), 2025–26 సంవత్సరానికి 13,992 మొక్కలు(90 శాతం) బతికాయని తేలడం విశేషం. ఇక కేంద్రప్రభుత్వం అర్బన్ ఫారెస్టుల అభివృద్ధికి నగర్ వాన్ ఉద్యాన యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 220.95 హెక్టార్లలో ఉన్న ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్ల పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రత్యేక నిధులతో సిటీ ఫారెస్ట్ బ్లాక్‌గా అభివృద్ధి చేస్తూనే ఇతర చోట్ల నాటడానికి కావాల్సిన మొక్కల పెంపకానికి నర్సరీ నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది 35లక్షల మొక్కలు
వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 35,23,300 మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్దేశించింది. అటవీ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేసి శాఖల వారీగా మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఇవికాక ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో బ్లాక్ ప్లాంటేషన్ పేరిట నాటుతున్న మొక్కలు పెరిగి చిట్టడవులను తలపిస్తుండడంతో మరిన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు.
హరితనిధి ద్వారా అడవుల రక్షణ
ప్రభుత్వ పథకాల ద్వారా అడవుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. హరిత నిధి నుంచి అటవీ భూముల్లో ప్లాంటేషన్ నిర్వహించి సంరక్షిస్తున్నాం. బ్లాక్ ప్లాంటేషన్లలో ఏటా నాటే మొక్కల్లో 92 శాతం మేర మొక్కలు బతుకుతున్నాయి. మొక్కల పంపకంలో గొల్లగూడెం ఫారెస్టు గుర్తింపు సాధించింది.
– సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, జిల్లా అటవీ అధికారి