అలవి కాని హామీలతో గెలిచిన కాంగ్రెస్
● ఉమ్మడి జిల్లా రాజకీయ సమీకరణలతో మేం నష్టపోయాం.. ● స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు కథానాయకులై కదలాలి ● మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు ఓటేస్తే.. వాటిని అమలు చేయకుండా ప్రజలను ప్రభుత్వం కాటేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నా ఈయనెవరో బిర్యానీ పెడతానంటున్నడుగా అని కాంగ్రెస్‌కు ఓటేశారని తెలిపారు. కానీ ప్రజలకు ఇప్పుడు అసలు విషయం అర్థమైనందున, ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో రేవంత్‌రెడ్డికి తెలుసునన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. వాటిని బొంద పెడతారని ప్రజలు ఊహించక ఒక్క తప్పు ఓటు వేసినందుకు ఐదేళ్లు శిక్ష పడిందని పేర్కొన్నారు.
రెండుసార్లు అవకాశం ఇచ్చారు..
తెలంగాణ ప్రజలు రెండు సార్లు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వాన కొత్త రాష్ట్రంలో బుడిబుడి అడుగులు వేస్తూనే.. మరోవైపు పటిష్టమైన పునాది వేసేలా నిర్మాణాత్మకంగా, ప్రణాళికాయుతంగా పదేళ్లు పనిచేశామని తెలిపారు. తద్వారా వ్యవసాయం, సాగునీరు, పట్టణ, పల్లె అభివృద్ధి, విద్య, వైద్యం, గిరిజన, దళితుల, బలహీన వర్గాలు, మహిళలు, మైనార్టీల సంక్షేమం తదితర రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపామన్నారు. తద్వారా 2014లో కేవలం 63 సీట్లు సాధించిన బీఆర్‌ఎస్‌కు 2018లో ప్రజలు 88 సీట్లు కట్టబెట్టారని తెలిపారు.
హామీలు ఊదరగొట్టి..
పదేళ్లపాటు బీఆర్‌ఎస్ అద్భుత పాలన అందించాక 2023లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలను ఆకర్షించాయని కేటీఆర్ చెప్పారు. నోటికి వచ్చినట్లుగా హామీల వర్షం కురిపించి రైతు డిక్లరేషన్, బోనస్ పేరిట బోగస్ మాటలు చెప్పారన్నారు. బీసీ డిక్లరేషన్, రైతు భరోసా, ఉద్యోగాల కల్పన, యువతుల పెళ్లికి తులం బంగారం తదితర ఈస్ట్‌మన్ కలర్ సినిమాను నమ్మడంతో ప్రజలు మోసపోయారని చెప్పారు.
ప్రతినాయకుడు ఉంటేనే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో భాగంగా 2023లో నష్టం జరిగిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అన్నీ సవ్యంగా సాగితే జీవితం విలువ అర్థం కాదని, చుట్టూ ఉండే మనుషుల విలువ, నాయకుడి విలువ తెలియాలన్నా ప్రతినాయకుడు ఉండాల్సిందేనని చెప్పారు. జిల్లాలో ముగ్గురు మంత్రుల్లో ఒకాయన చెప్పిన బాంబులు ఇప్పటికీ పేలలేదన్నారు. ఇంకొకరు కమీషన్లలో బిజీగా ఉంటే, మరొకరు వ్యవసాయ మంత్రిగా ఏం చేస్తున్నాడో తెలియడం లేదని చెప్పారు. రైతులు ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుండడం ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని తెలిపారు.
మీ కోసం మేం కష్టపడతాం..
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నాయకుల కోసం కార్యకర్తలు కష్టపడ్డారని, ఇప్పుడు కార్యకర్తల కోసం నాయకులు కష్టపడతారని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున కష్టపడి పనిచేస్తే ఖమ్మం, భద్రాద్రి జెడ్పీలు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ స్థానాలన్నీ గెలవొచ్చని తెలిపారు. మున్సిపాలిటీలు, ఎంపీపీ స్థానాల్లోనూ యువకులు ముందుకొచ్చి కాంగ్రెస్‌ను చీల్చి చెండాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసాన్ని గ్రామగ్రామాన ఎండగట్టేలా మరో కేసీఆర్‌లా కథానాయకులై కదలాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, కొండబాల కోటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, ఖమర్, తాజుద్దీన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.