
పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు జరగాలి
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కామేపల్లి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికంగా సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కామేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్య కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. తొలుత పీహెచ్‌సీ ఫార్మసీలో మందుల నిల్వలు, గర్భిణులకు అందుతున్న సేవలు, ల్యాబ్‌లో చికిత్సలపై ఆరా తీశారు. అలాగే, చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వైద్యసేవలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. జిల్లా ఆస్పత్రికి పంపించకుండా ఇక్కడే సాధారణ ప్రసవాలు ఎక్కువ సంఖ్యలో జరిగేలా చూడడం ద్వారా నమ్మకం పెంచాలని తెలిపారు. అనంతరం పశు వైద్యశాలను పరిశీలించగా, భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన నిర్మానానికి ప్రతిపాదించాలని ఆదేశించారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ ఆరా తీశారు. తహసీల్దార్ సుధాకర్, వైద్యాధికారులు శిరీష, నాగులు, ఆర్‌ఐ సక్రు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన
అవసరం
ఖమ్మంలీగల్: విద్యార్థి దశలో చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్‌రావు సూచించారు. ఖమ్మం దానవాయిగూడెంలోని మహత్మాగాంధీ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని, తద్వారా ఉన్నత స్థాయికి చేరాలన్నారు. అలాగే, బాల్య వివాహ నిషేధ చట్టం, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ అరుణకుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు.
టీపీఎస్‌ల ఏర్పాటుకు
వసతుల పరిశీలన
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, బనిగండ్లపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. ఈ పాఠశాలలను ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు(టీపీఎస్)గా తీర్చిదిద్దాలని నిర్ణయించిన నేపథ్యాన అదనపు కలెక్టర్ ఇక్కడి వసతులు, విద్యార్థుల సంఖ్యపై సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుతో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి బోధన అందుతుందని తెలిపారు. అనంతరం బనిగండ్లపాడులో ఆస్పత్రి, జూనియర్ కళాశాలను తనిఖీ చేసి మరమ్మతులపై సూచనలు చేశారు. అలాగే, జమలాపురంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అదనపు కలెక్టర్ పూజలు చేశారు. మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, విద్యాశాఖ అధికారులు విన్సెంట్, రామకృష్ణ, తహసీల్దార్ ఎం.ఉషాశారద, ఎంపీడీఓ బి.సురేంద్రనాయక్, ఎంఈఓ బి.మురళీమోహన్‌రావు, ఎంపీఓ జి.శ్రీలక్ష్మి, ఏపీఎం నాగరాజు, హెచ్‌ఎం ఎన్.జ్యోతిశ్రీ పాల్గొన్నారు.
మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉపాధి
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగాల్లో మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడమే కాక ఉపాధి కల్పించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి బి.పురంధర్ తెలిపారు. ఇందుకోసం రెగ్యులర్ విధానంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు నెలపాటు శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తులను వచ్చేనెల 18లోగా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, వివరాలకు 97040 03002 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు జరగాలి

పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు జరగాలి