
ప్రభుత్వ చేయూతతో బలోపేతం
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్‌లో శుక్రవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తదితరులతో కలిసి రఘునాథపాలెం మండలానికి చెందిన 934 సంఘాలకు రూ.1.18 కోట్లు, కేఎంసీ పరిధిలో 2,958 సంఘాలకు రూ.2.81 కోట్ల వడ్డీ లేని రుణాలు, పలువురు సభ్యుల బీమా చెక్కులు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆయన ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ పథకం మహిళల పేరిటే అమలవుతున్నందున ఆర్థిక స్వావలంభన సాధించాలని సూచించారు. మహిళలు ఎదిగితే వారి కుటుంబం, తద్వారా సమాజం బాగుపడుతుందని తెలిపారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో లేని వారు సభ్యులుగా చేరాలని సూచించారు. ఖమ్మం నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇళ్లు మంజూరు కాగా గుడిసెలో నివసించే వారికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. కాగా, వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను హైదరాబాద్ జూలాజికల్ పార్క్ మాదిరి అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే, ఖిల్లా వద్ద రోప్‌వే పనులను వేగవంతం చేస్తామని తెలి పారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఆర్టీసీ అద్దె బస్సులు, అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యతతో పాటు యూనిఫామ్ కుట్టే పనులు కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 9వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం జరుగుతోందని, అర్హులందరికీ విడతల వారీగా ఇళ్లు అందజేస్తామని వెల్లడించారు. తొలుత మంత్రి, అధికారులు పార్క్‌లో మొక్కలు నాటగా, మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించా రు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర విత్తన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కేఎంసీ మేయ ర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీలత, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీని వాస్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్ రావూరి కరుణ, మార్కెట్, ఆత్మ, పీఏసీఎస్ చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, దిరిశాల చిన వెంకటేశ్వర్లు తాత రఘురాం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని పథకాలు మహిళల పేరుతోనే..
ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు