
నిఘా శాఖకు సొంత గూడు!
● ఇంటెలిజెన్స్ విభాగానికి మూడు భవనాలు ● ఎన్నెస్పీ క్యాంప్‌లో పూర్తయిన నిర్మాణం
ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లా పోలీసు శాఖలో అత్యంత కీలకమైన నిఘా విభాగాని(ఇంటెలిజెన్స్)కి నూతన భవనాలు సిద్ధమయ్యాయి. ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఈ కార్యాలయాల్లో ఉద్యోగులు ఇబ్బంది పడుతండగా ప్రభుత్వం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించింది. దీంతో ఖమ్మం నడిబొడ్డున ఎన్నెస్పీ క్యాంప్‌లో కేటాయించిన స్థలంలో భవనాలు నిర్మించి ప్రారంభానికి ముస్తాబు చేశారు.
ఏళ్ల తర్వాత...
పోలీసు శాఖలోనే కాక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు, రాజకీయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించడంలో ఇంటెలిజెన్స్ విభాగం కీలకంగా నిలుస్తుంది. కానీ ఈ శాఖ కార్యకలాపాలకు సొంత భవనాలు లేక ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. అరకొర సౌకర్యాల నడుమ ఇబ్బంది పడుతూనే ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. కాగా, గతంలో ఉమ్మడి జిల్లాకు డీఎస్పీ స్థాయి అధికారి ఇన్‌చార్జ్‌గా ఉండేవారు. ఆతర్వాత అడిషనల్ ఎస్పీ స్థాయికి అప్‌గ్రేడ్ అయింది. ఈమేరకు నూతన భవనం అవసరమని గతంలో అప్పట్లో ఇంటెలిజెన్స్‌కు అడిషనల్ ఎస్పీగా పనిచేసిన బాలకిషన్‌రావు కలెక్టర్‌కు ప్రతిపాదనలు సమర్పించారు.
సిద్ధమైన భవనాలు
అడిషనల్ ఎస్పీగా పనిచేసిన బాలకిషన్‌రావు వినతితో ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లో భవనాల నిర్మాణానికి 900 గజాల స్థలం కేటాయించారు. దీంతో అడిషనల్ ఎస్పీకి ఒకటి, ఇద్దరు సీఐలకు రెండు చొప్పున మొత్తం మూడు భవనాలను పోలీస్ హౌజింగ్ సొసైటీ ద్వారా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ రామోజీ రమేష్ పర్యవేక్షణలో నిర్మాణ పనులు చివరి దశకు చేరగా, ప్రహరీ నిర్మాణానికి ఇంకొంత స్థలం అవసరమని కలెక్టర్‌ను కోరడంతో సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ప్రస్తుతం పూర్తయిన భవనాల్లో ఒకటి అడిషనల్ ఎస్పీతో పాటు ఆయన కార్యాలయ సిబ్బందికి, ఇద్దరు సీఐలు, సిబ్బంది విధులు నిర్వహించేలా చెరో భవనం కేటాయించనున్నారు. కాగా, ఈ మూడు భవనాలను త్వరలోనే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.