
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
పాల్వంచ: పాల్వంచ మున్సిపల్ డివిజన్ కార్యాలయంలో మరోసారి ఏసీబీ తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ ఐ.రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయానికి చేరుకున్న అధికారులు గేట్లు, తలుపులు మూసివేయించారు. తొలుత మొదటగా మేనేజర్ ఎల్‌వీ.సత్యనారాయణతో మాట్లాడారు. అనంతరం కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ కె.సుజాత చేరుకోగా, ఆమెతో పాటు ఇతర సిబ్బందిపై విచారణ చేపట్టారు. కార్యాలయంలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి పనులు, ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈక్రమంలో ఉద్యోగుల వద్ద అనధికారికంగా ఉన్న రూ.40 వేల నగదును సైతం సీజ్ చేశారు.
ఉదయం నుంచి రాత్రి వరకు విచారణ
ఉదయం 11.30 గంటల సమయంలో కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు కార్యాలయంలో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కమిషనర్ గదిలోకి రికార్డులు తెప్పించుకుని పరి శీ లించారు. ఇటీవల మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయని, బినామీల పేరుతో అధికారులే పనులు చేపట్టారనే ఆరోపణలు రావడం, అడ్డగోలుగా బిల్లులు చేసి నిధులు పక్కదోవ పట్టించారనే ఫిర్యాదుల నేపథ్యాన పూర్తి వివరాలు ఆరా తీశారని తెలిసింది. ఈక్రమాన ప్రైవేట్ ఉద్యోగులు, డ్రైవర్లు, అటెండర్లు, ఇతర సిబ్బంది ఉద్యోగుల ఫోన్ పే, గూగుల్ పే, ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించగా కొందరి ఫోన్లలో నగదు బదిలీలు జరిగినట్లు గుర్తించారు. ఈ విషయమై డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ కార్యాలయంలో ఇటీవల జరిగిన అనేక పను ల విషయంలో జరిగిన అవకతవకలు, ప్రైవేట్ వ్యక్తులతో చేస్తున్న అక్రమార్జనపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టామని తెలిపారు. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వెల్లడించారు.
పాల్వంచలో ఆకస్మిక తనిఖీ