
విద్యుదాఘాతంతో మహిళ మృతి
ఖమ్మంరూరల్: డాబాపై దుస్తులు ఆరవేస్తున్న మహిళకు 11కేవీ విద్యుత్ తీగలు తాకడంతో షాక్‌కు గురై మృతి చెందిన ఘటన రూరల్ మండలంలోని కస్నాతండాలో సోమవారం జరిగింది. తండాకు చెందిన మాధవి(40)కి భ భర్త సైదయ్య, ఇద్దరు కుమారులు ఉండగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఇంటిపై నుంచి 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్తోంది. ఈక్రమాన సోమవారం ఉదయం మాధవి దుస్తులు ఆరవేసేందుకు డాబాపైకి వెళ్లగా తీగలు చేతికి తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.
మృతదేహంతో ఆందోళన
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మాధవి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు, స్థానికులు పల్లెగూడెం సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న లైన్‌ను తొలగించాలని పలుమార్లు కోరినా పట్టించుకోని పేర్కొన్నారు. ఈవిషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విన్నవిస్తే లైన్ మార్పునకు నిధులు మంజూరు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈమేరకు మూడు గంటల పాటు ధర్నా జరగగా బంధువులు ఆగ్రహంతో సబ్‌స్టేషన్‌పై దాడి చేయగా కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా, ఆందోళన విష యం తెలుసుకున్న పోలీసులు చేరుకుని నచ్చచెప్పగా ఆందోళన విరమించారు. కాగా, ఘటనపై మాధవి భర్త సైదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ ముష్క రాజు తెలిపారు.
హెచ్చరికలు పాటించకే ప్రమాదాలు
హెచ్చరికలు పాటించకపోవడంతోనే విద్యుత్ ప్రమాదా లు చోటు జరుగుతున్నాయ ని, ఈక్రమంలోనే కస్నాతండాలో ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. కస్నాతండాలో 11 కేవీ విద్యుత్ లైన్ కింద నిర్మించుకున్న మాధవి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో అనుమతి లేకుండా విని యోగిస్తున్నారని వెల్లడించారు. ఈమేరకు ఏప్రిల్ 19న విద్యుత్ చౌర్యం కేసు కూడా నమోదైందని చెప్పారు. కాగా, ప్రమాదకరంగా ఉన్నచోట విద్యు త్ లైన్లను మార్చేందుకు చర్యలు చేపడుతామని ఎస్‌ఈ పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణమని
బంధువుల ధర్నా
పల్లెగూడెం సబ్‌స్టేషన్‌పై దాడి

విద్యుదాఘాతంతో మహిళ మృతి