
డిజిటల్ లావాదేవీలకు జిల్లా ఎంపిక
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంక్ లింకేజీ రుణాలు సకాలంలో తిరిగి చెల్లించేలా అధికారులు, సిబ్బంది పర్యవేక్షించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆమె ఖమ్మంలోని మహిళా మార్ట్‌ను సందర్శించాక జిల్లా సమాఖ్య భవనంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీఆర్‌డీఏ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ దేశంలోని 700 జిల్లాల్లో పది జిల్లాలను డిజిటల్ లావాదేవీలకు ఎంపిక చేయగా జాబితాలో ఖమ్మం కూడా ఉన్నందున మహిళా సంఘాల సభ్యులు నగదు లావాదేవీలను డిజిటల్ విధానంలో చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. అలాగే, సంఘాల నిర్వహణలో అవకతవకలు జరగకుండా, రుణాల మంజూరు, రికవరీ సాఫీ జరిగేలా మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ ఏపీఎం, డీపీఎంలు పాల్గొనాలని సూచించారు. జిల్లాలో మహిళా సమాఖ్యలకు గోదాంలు మంజూరు చేశామని, మండల సమాఖ్యలకు రెండు, వీఓఏలకు కేటాయించిన ఎనిమిది గోదాంల నిర్మాణాన్ని పర్యవేక్షించాలని తెలిపారు. కాగా, ప్రతీ గ్రామ సమాఖ్య పరిధిలో 15 – 18 ఏళ్ల కిశోర బాలికలు, 60 ఏళ్లు పైబడిన మహిళలు, దివ్యాంగులతో ఒక్కో సంఘం ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. కాగా, బస్సు నడిపేందుకు ఆసక్తి ఉన్న మహిళలను గుర్తిస్తే శిక్షణ ఇప్పించనున్నట్లు సీఈఓ వెల్లడించారు.
మహిళా మార్ట్ అద్భుతం..
మహిళా సంఘాల సభ్యులు రూపొందించే ఉత్పత్తుల అమ్మకానికి మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేయడం.. నిర్వహణను సెర్ప్ సీఈఓ దివ్య అభినందించారు. మహిళా మార్ట్‌లో ఉత్పత్తులను పరిశీలించిన ఆమె సభ్యులతో మాట్లాడి ప్యాకింగ్, అమ్మకాలపై ఆరా తీశారు. ఆతర్వాత మార్ట్ వద్ద క్యాంటీన్‌లో టీ తాగి సిబ్బందిని అభినందించారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సెర్ప్ డైరెక్టర్లు రజిత, నర్సింహరెడ్డి, అడ్మిన్ విజ యలక్ష్మి, డీఆర్‌డీఓ ఆర్.సన్యాసయ్య, అడిషనల్ డీఆర్‌డీఓ జయశ్రీ, డీపీఎంలు ఆంజనేయులు, రాజేష్ పాల్గొన్నారు.
జిల్లా సమాఖ్య సమావేశంలో సెర్ప్ సీఈఓ దివ్య
మహిళా మార్ట్ నిర్వహణ బాగుందని కితాబు