గొర్రెల్లో ‘నీలి నాలుక’ | - | Sakshi
Sakshi News home page

గొర్రెల్లో ‘నీలి నాలుక’

Jul 14 2025 4:39 AM | Updated on Jul 14 2025 4:39 AM

గొర్ర

గొర్రెల్లో ‘నీలి నాలుక’

● దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి ● జీవాలకు ప్రాణాంతకంగా మారుతున్న రుగ్మత ● ముందస్తు గుర్తింపు, జాగ్రత్తలతోనే మేలు

ఖమ్మంవ్యవసాయం: గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి (బ్లూటంగ్‌) విజృంభిస్తోంది. జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు పశుసంవర్థక శాఖ గుర్తించింది. దోమల వల్ల సంభవించే ఈ ప్రాణాంతక వ్యాధి వర్షాకాలంలో సోకుతుంది. వైరస్‌లతో కలిగే వ్యాధిని మూతి వాపు, పూత రోగం అని కూడా అంటారు. జిల్లాలో 6.67 లక్షల గొర్రెలున్నాయి. జీవాల పెంపకందారులు ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వ్యాధి లక్ష ణాలు, నివారణ చర్యలపై జిల్లా పశువ్యాధి నిర్ధారణా ప్రయోగశాల అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ సీహెచ్‌ రఘుపతి ఇచ్చిన సలహాలు, సూచనలు ఇలా ఉన్నాయి.

వ్యాధి వ్యాప్తి

నీలి నాలుక వ్యాధి.. కలుగజేసే వైరస్‌లు ‘క్యూలికాయిడ్స్‌’ అనే దోమకాటు ద్వారా జీవాల్లో ప్రవేశిస్తా యి. వర్షాకాలంలో ఈ వ్యాధి క్రిముల అభివృద్ధికి, అవి విస్తరింపజేసే దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెను దోమ కుట్టి అదే దోమ ఆరోగ్యవంతమైన గొర్రెను కుట్టడం వల్ల ఈ వ్యాధి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందుతుంది. మందలో ఒక్కసారిగా ఈ వ్యాధి సంభవించి, మరణాలకు దారితీస్తుంది. గొర్రెల కాపరులు వ్యాధిని గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

లక్షణాలు

●వ్యాధి సోకిన గొర్రెల్లో జ్వరం ఎక్కువగా (105 – 106 డిగ్రీల ఫారన్‌ హీట్‌ ఉష్ణోగ్రత) ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి 3–8 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయి.

●వ్యాధి సోకిన 3వ రోజున గొర్రె నోరు, ముక్కుల లోపల ఎర్రగా కంది క్రమంగా పెదాలు వాస్తాయి. నోటి నుంచి చొంగకారుతుంది. క్రమంగా చొంగ చిక్కబడి ముక్కుల గుండా నీరుకారుతుంది. పొక్కులు ఏర్పడుతాయి.

●ముఖం, పెదవులు, దవడల మధ్య వాపు వస్తుంది.

●నోటి లోపల నాలుక ఎర్రబడి పైపొర లేచిపోయి పొక్కులుగా మారుతాయి.

●నాలుక నీలి రంగులోకి మారడం వల్ల నీలినాలుక రోగం అంటారు.

●వ్యాధి సోకిన వారం తరువాత గిట్టల పైభాగాన ఎర్రటి నెత్తురు చార కనిపించి గొర్రె కుంటుతుంది.

●ఆహారం తీసుకోకుండా క్షీణించి మరణాలు కూడా సంభవిస్తాయి.

నివారణ

●వ్యాధి తీవ్రతపై సూర్యరశ్మి ప్రభావం చూపుతుంది కాబట్టి వ్యాధిగ్రస్త జీవాలను నీడలో ఉంచి చికిత్స చేయించాలి. మంద నుంచి దూరంగా ఉంచాలి.

●దోమల నివారణకు వేపాకు లేదా నీలగిరి, కలబండ లేదా పిడకల్ని కాల్చాలి. రాత్రి వేళల్లో ఎలక్ట్రిక్‌ బల్బులు పెడితే దోమల ఉధృతి తగ్గుతుంది.

●గొర్రెల షెడ్లలో ఫ్యాన్లు, దోమతెరలను వాడాలి.

చికిత్స

●వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించాలి. యాంటిబయోటిక్‌, నొప్పి నివారణ మందులు వాడటం ద్వారా గొర్రెలు చనిపోకుండా కాపాడుకోవచ్చు.

●వ్యాధి సోకిన గొర్రెలను సకాలంలో గుర్తించాలి. నోటిపుండ్లను పొటాషియం పర్మాంగనేట్‌ లోషన్‌తో శుభ్రం చేసి వైద్యులు సూచించిన మందు పూయాలి.

●గొర్రెలకు రాగిజావ లేదా మొక్కజొన్న జావను ఉప్పు కలిపి తాగించాలి. లేత ఆకులను మేపాలి.

●5 రోజుల పాటు ఒక్కో గొర్రెకు డాక్టర్‌ సలహాతో యాంటీబయాటిక్‌ ఇంజక్షన్లు వేయాలి. నీరసించిన గొర్రెలకు గ్లూకోజ్‌ ఎక్కించాలి.

●కాలిగిట్టల మీద పుండ్లను కడిగి హిమాక్స్‌, నెమ్‌లెంట్‌ వంటి ఆయింట్‌మెంట్లను పూయాలి.

వ్యాధి నివారణ చర్యలు

●గొర్రెల దొడ్లలో ఫినాయిల్‌, మలాథియాన్‌ వంటి క్రిమిసంహారక మందులను చల్లాలి

●ఎండిన వేపాకు పొగ, యూకలిప్టస్‌ పొగను సాయింత్రం పూట వేయాలి.

●డాక్టర్‌ సలహాపై మందులు విధిగా వాడాలి.

●విటమిన్‌–సీ ఇంజక్షన్‌, పౌడర్‌ను వాడాలి. విట్‌–ఏ సిరప్‌ను వాడాలి.

గొర్రెల్లో ‘నీలి నాలుక’1
1/1

గొర్రెల్లో ‘నీలి నాలుక’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement