
నమ్మి వస్తే.. ప్రాణం తీశాడు..
● స్నేహితులతో కలిసి మహిళను హత్య చేయించిన వ్యక్తి ● సూర్యాపేట జిల్లా కిష్టారం అడవుల్లో ఘటన
కొణిజర్ల: జీవితాంతం కలిసి ఉంటాడని నమ్మి భర్త పిల్లలను వదిలేసి వచ్చిన ఓ మహిళను.. ఆ వ్యక్తే స్నేహితులతో కలిసి హత్య చేసి, అడవిలో పడేశాడు. ఈ ఘటన మండలంలోని విక్రమ్‌నగర్‌లో విషాదాన్ని నింపింది. ఎస్‌ఐ గుగులోత్ సూరజ్ కథనం ప్రకారం.. కామేపల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన భూక్యా మదన్ అదే గ్రామానికి చెందిన హస్లీతో వివాహేతర సంబంధం పెట్టుకుని అక్కడి నుంచి ఆమెను తీసుకుని కొణిజర్ల మండలం విక్రమ్‌నగర్‌కు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. హస్లీకి అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా కు.ని. చేయించుకుంది. దీంతో ఆమెకు పిల్లలు పుట్టరని మదన్ విక్రమ్‌నగర్‌కు చెందిన మరో మూగ యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి హస్లీకి, మదన్ వివాహం చేసుకున్న యువతికి, ఆమె కుటుంబ సభ్యులకు తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా హస్లీ పీడ వదిలించుకోవాలనుకున్న మదన్ తన స్నేహితులు అయిన కొణిజర్లకు చెందిన చల్లా నాగేశ్వరరావు, బస్వాపురానికి చెందిన తమ్మిశెట్టి నరసింహారావు సహకారంతో హస్లీకి మాయమాటలు చెప్పి చేతబడులు చేయించే వారున్నారని, వారితో చేతబడి చేయించి మూగ యువతిని చంపిద్దామని చెప్పి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చింతలపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిష్టారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పసరు పేరుతో గుర్తు తెలియని విషం తాగించారు. ముగ్గురు కలిసి గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడవేసి గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి ఇళ్లకు వచ్చేశారు. ఈ నెల 11న మహిళ అదృశ్యమైందని కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందగా.. తమకు మదన్ మీదనే అనుమానం ఉందని మృతురాలి కూతురు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సూరజ్ నేతృత్వంలో పోలీసులు మదన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఆదివారం ఘటనా స్థలానికి తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించాడు. ఎస్‌ఐ సూరజ్ ఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం చేయించి మృతురాలి బంధువులకు అప్పగించారు. మదన్‌ను అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.