
ఎండిపోతున్న వరి నారుమడులు
● వర్షాభావ పరిస్థితులతో రైతుల ఆందోళన ● సీతారామ జలాలు విడుదల కావడంతో ఊరట
కల్లూరురూరల్: ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు దోబూచులాడుతున్నాయి. ఇప్పటికే వరకు సరైన వర్షాలు లేక నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయలేదు. దీంతో ఆయకట్టు ప్రాంతంలోని వరి నారుమడులు ఎండిపోతున్నాయి. కల్లూరు మండలంలోని వాచ్యానాయక్ తండా, చండ్రుపట్ల, రఘునాథ బంజరు, లింగాల, పుణ్యపురం మేజర్ కాలుల్వవ కింద పాయపూరు, ముచ్చవరం, యజ్ఞనారాయణపురం, ఓబులరావు బంజరు గ్రామాల్లో గత నెల 15వ తేదీ నుంచి వరి నారు సిద్ధం చేసుకుంటున్నారు. సాగర్ నీటి విడుదల ఆలస్యమైనా తప్పక నీరు అందుతుందనే భావనతో నార్లు పోయగా, కొందరు నాట్లు కూడా వేశారు. కానీ ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు, సాగర్ నీటి విడుదలలో జాప్యంతో నారుమడులు, నాట్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.
సీతారామ ప్రాజెక్టు నీరే ఆధారం
సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల కాక వరి నాట్లు ఎండిపోయే పరిస్థితులు ఎదురవుతుండగా సీతారామ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడం రైతుల్లో ఆశలు నింపింది. కల్లూరు, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో 70శాతం మేరకు నాట్లు పూర్తికాగా, నాలుగు మండలాల్లో 69వేల ఎకరాల్లో నాట్లు వేసినటు అంచనా. ఈనేపథ్యాన శనివారం సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.