
చిరువ్యాపారులకు అండగా ‘పోస్టల్ బ్యాంకు’
ఖమ్మంగాంధీచౌక్: నగదు రహిత విధానం లావాదేవీలు పెరిగిన నేపథ్యాన చిరు వ్యాపారుల కోసం వాణిజ్య బ్యాంకుల తరహాలోనే పోస్టల్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) మర్చంట్ యాప్‌ను రూపొందించారు. వీధి వ్యాపారులు, కిరాణ షాపులు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు, ఇతర చిన్న వ్యాపారులు వినియోగదారుల నుంచి డిజిటల్ విధానంలో చెల్లింపుల స్వీకరణకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో క్యూఆర్ కోడ్లను సౌకర్యంగా పొందించారు. గుర్తింపు కార్డు మాదిరిగా మెడలో వేసుకునేలా, స్టాండ్ విధానంలో అమర్చేలా క్యూఆర్ కోడ్‌లను రూపొందించారు. వ్యాపారులు తమ ఆధార్ కార్డుతో సమీప పోస్టాఫీస్‌లో సంప్రదించి రూ.200తో పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఖాతా తెరిస్తే అదనపు ఫీజు లేకుండా డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 2వేల మందికి చిరువ్యాపారులు ఈ విధానంలో లావాదేవీలు నిర్వహిస్తున్నందున మిగతా వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి సూచించారు.