
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున అర్చకులు స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అలాగే, తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన భక్తుల నడుమ పల్లకీ సేవ చేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ పాల్గొన్నారు.
‘భక్తరామదాసు’ నుంచి సాగునీటి విడుదల
కూసుమంచి: మండలంలోని ఎర్రగడ్డ తండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్టు నుండి సాగు అవసరాలకు అధికారులు శనివారం నీటిని విడుద ల చేఽశారు. పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధి కారి రమేష్ పూజలు నిర్వహించగా, ప్రాజెక్టు డీఈఈ రమేష్‌రెడ్డి మోటార్ స్విచాన్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలా ల్లోని ఆయకట్టుతో పాటు చెరువులకు నీరు చేరుతుందని డీఈఈ తెలిపారు. మెట్ట పంటలు, వరి సాగుకు తొలుత పదిరోజులు నీరు సరఫరా చేస్తామని, ఈలోగా పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ జలాలు చేరాక చెరువులను పూర్తిస్థాయిలో నింపుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
35 మంది ఆపరేటర్ల బదిలీలు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని రెవెన్యూ శాఖలో ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న సీసీఎల్‌ఏ, భూభారతి ఆపరేటర్లను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్‌ఏ టైపిస్టు కమ్ ఆపరేటర్లు 14మంది, 21మంది భూభారతి ఆపరేటర్లను బదిలీ చేయగా, నూతన స్థానాల్లో వెంటనే చేరాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం బదిలీలు చేపట్టామని తెలిపారు. రెవెన్యూ శాఖ లో అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది విధుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు న్యాయం చేకూర్చాలనే నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.
రుణాల మంజూరు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: ఉపాధి పునరావాస పథకం కింద దివ్యాంగులకు రుణాల మంజూరు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లాకు రూ.50 వేల యూనిట్లు 25, రూ.లక్ష, రూ.2లక్షలు, రూ.3లక్షల యూనిట్లు ఒక్కొక్కటి మంజూరయ్యానని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 14నుంచి 31వ తేదీ వరకు http//tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
31వరకు ఫీజు గడువు పొడిగింపు
ఖమ్మం సహకారనగర్: ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీ డియట్‌లో ప్రవేశాలకు ఫీజు చెల్లించే గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ ఎస్.సత్యనారాయణ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఎం.పాపారావు తెలిపారు. అలాగే, ఆగస్టు 1నుండి 28వరకు సాధారణ ఫీజుతో పాటు పదో తరగతి వారు రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్థులు రూ.200 జరిమానాతో ప్రవేశాలు పొందొచ్చని వెల్లడించారు. సమీపంలోని ఓపెన్ స్కూల్ సెంటర్లను లేదా www.telanganaopenschool.org వెబ్‌సైట్‌తో పాటు మీ సేవా, టీ సేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకుని రెండు సెట్లను సెంటర్‌లో సమర్పించాలని సూచించారు. వివరాలకు 80084 03522 సంప్రదించాలని తెలిపారు.

శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం