
నెమ్మదిస్తున్న గోదావరి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం శనివారం సాయంత్రం నుంచి నెమ్మదించింది. ఎగువన ప్రాజెక్టుల నుంచి వరద భారీగా వస్తుండడంతో రెండు రోజులుగా నదిలో ఉధృతి పెరిగింది. వరద నీటిమట్టం శుక్రవారం రాత్రి 11 గంటలకు 38.8అడుగులకు చేరింది. శనివారం ఉదయం 40.5 అడుగులకు, క్రమంగా మధ్యాహ్నం వరకు 41.5 అడుగులకు పెరిగింది. అనంతరం తగ్గుముఖం పట్టింది. రాత్రి 9గంటలకు 40 అడుగులకు తగ్గింది. ఎగువన ఉన్న ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో తగ్గుతుండడంతో క్రమంగా గోదావరి వరద కూడా తగ్గుతోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వరద ఉధృతితో రహదారులు మునిగి భద్రాచలం దిగువన ఏపీలోని విలీన మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆపై వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జిల్లా అధికారులు, ముంపు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
దుమ్ముగూడెంలో నిలకడగా..
దుమ్ముగూడెం: ఎగువ ప్రాంతాల నుంచి వరద నెమ్మదించడంతో శనివారం మండలంలో గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. పర్ణశాల నారచీరల ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉండగా, సున్నంబట్టి–బైరాగులపాడు గ్రామాల మధ్య రహదారి పైకి వరద నీరు చేరింది.
భద్రాచలం వద్ద 41.5
అడుగులకు పెరిగి తగ్గుతున్న వరద

నెమ్మదిస్తున్న గోదావరి