
‘సీతారామ’ జలాలు విడుదల
● మోటార్ ఆన్ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం ● సమస్యను మంత్రి ఉత్తమ్ దృష్టికి తుమ్మల తీసుకెళ్లడంతో ఫలితం
అశ్వాపురం/ఖమ్మంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్ పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఒక మోటార్‌ను శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్విచాన్ చేసి నీరు విడుదల చేశారు. నాగార్జుసాగర్ నుంచి సాగు అవసరాలకు నీరు విడుదల కాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నా రు. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నారుమడులు ఎండిపోతున్న విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లా రు. ఈ నేపథ్యాన అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంప్‌హౌస్ నుంచి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి లో 8లక్షల క్యూసెక్కుల జలాలు డిశ్చార్జ్ అవుతుండడంతో, ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేవరకు పంప్‌హౌస్ నుంచి నీరు విడుదల చేస్తామని అఽధికారులు తెలిపారు. గోదావరి జలాలు ఇక్కడి నుంచి ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం పంప్‌హౌస్ ల ద్వారా ఏన్కూరు లింక్ కెనాల్(రాజీవ్ కెనాల్) ద్వారా ఎన్‌ఎస్‌పీ కెనాల్‌కు తరలనున్నాయి. ఆపై వైరా, సత్తుపల్లి నియోజకవర్గా ల పరిధిలోని ఆయకట్టుకు నీరు అందనుంది. కాగా, నీటి విడుదల కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రవికుమార్, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, ఏఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.