
రాజ్యాంగం రద్దుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కుట్రలు
ఖమ్మంమయూరిసెంటర్: భారత రాజ్యాంగానికి మూలస్తంభాలుగా నిలుస్తున్న సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్ నేత దత్తాత్రేయ వ్యాఖ్యానించడం దేశ ప్రజలందరినీ అవమానించినట్లేనని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రాజ్యాంగం రద్దుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన సంఘం ఉమ్మడి జిల్లా స్థాయి శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను లేకుండా చేసి మత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని పాలకులు కుట్ర పన్నారని ఆరోపించారు. గోరక్షక దళాలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆర్థిక దోపిడీ మూలాలు అంశంపై బండారు రమేష్ మాట్లాడగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందిపాటి మనోహర్, జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల భారతితో పాటు బండి రమేష్, పాపిట్ల సత్యనారాయణ, కొమ్ము శ్రీను, కర్లకుంట నరేష్, మాచర్ల గోపాల్, ఎస్.కే.సైదులు, నోముల పుల్లయ్య, కె.సర్వేశ్వరరావు, నందిపాటి రమేష్, మన్నెం మోహన్‌రావు పాల్గొన్నారు.
కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు