
కాంగ్రెస్ పార్టీ.. బీసీల పక్షపాతి
ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, పువ్వాళ్ల
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలోనే తొలిసారి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా నిలిచిందని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాల ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి వంశీచంద్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యాన శుక్రవారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం ఆధ్వర్యాన సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశాక వంశీచంద్‌రెడ్డి, దుర్గాప్రసాద్ మాట్లాడారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని లక్ష్యంతో మంత్రివర్గ సమావేశంలో 42 శాతం అమలుకు నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహ్మద్ జావేద్, కార్పొరేటర్ రాపర్తి శరత్, మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, హారికనాయడు, గజ్జెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.