
సాక్షి వద్దకే న్యాయాధికారి
ఖమ్మం లీగల్: ఖమ్మం సంచార ప్రత్యేక న్యాయస్థానం న్యాయాధికారి బి.నాగలక్ష్మి గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా సాక్షి దివ్యాంగుడు కావడంతో ఆయన ఉన్న ఆటో వద్దకే వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. జిల్లాలోని సింగరేణి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో లావుడియా సురేష్ సాక్షిగా ఉన్నాడు. ఆయన దివ్యాంగుడు కావడంతో ఆటోలో తీసుకొచ్చినా కిందకు దింపడం కష్టమైంది. దీంతో వాహనం వద్దకే వెళ్లిన న్యాయాధికారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
వైరా రిజర్వాయర్ నుంచి నీటి విడుదల
వైరా: వైరా రిజర్వాయర్ కింద వరి సాగు చేయనున్న రైతుల కోసం కుడి, ఎడమ కాల్వల ద్వారా అధికారులు గురువారం నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 17అడుగుల మేర నీరు ఉండడమే కాక 70 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో కాల్వల ద్వారా రోజుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదలకు నిర్ణయించారు. వరి సాగు చేయనున్న రైతులు నార్లు పోస్తుండడంతో వారు ఇబ్బంది పడకుండా వారం పాటు అనధికారికంగా నీరు విడుదల చేస్తున్నారు.
ఆగస్టులోగా కోడిగుడ్ల
సరఫరా టెండర్లు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు(రెసిడెన్షియల్ పాఠశాలలు), అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన కోడిగుడ్ల సరఫరా కోసం ఆగస్టు మొదటి వారంలోగా టెండర్లు ఖరారు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆమె మరో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడుతూ హాస్టళ్లు, కేజీబీవీ లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర విద్యాసంస్థలకు జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలోనే అవసరమైన కోడిగుడ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే, శిథిలావస్థ భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలను ఇంకో చోట మార్చాలని సూచించిన ఆమె హాస్టళ్ల మెనూ అమలుపై తనిఖీ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు కస్తాల సత్యనారాయణ, ఎన్.విజయలక్ష్మి, డాక్టర్ పురందర్, నర్సయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మిల్లర్లు సీఎంఆర్
సకాలంలో అప్పగించాలి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని మిల్లర్లు సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)ను సకాలంలో అప్పగించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం రైస్‌మిల్లర్లతో సమావేశమయ్యారు. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పెండింగ్ ఉన్న బియ్యం అప్పగించడమే కాక ఈ ఏడాది యాసంగి సీఎంఆర్ అందజేయడం మొదలుపెట్టాలని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ డీసీఎస్‌ఓ చందన్‌కుమార్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
40రోజుల్లోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే రద్దు
రఘునాథపాలెం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులు వేగం పెంచాలని జెడ్పీ సీఈవో దీక్ష రైనా సూచించారు. మంజూరైన నలభై రోజుల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించకపోతే రద్దయ్యే ప్రమాదముందని ఆమె తెలిపారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం పరిశీలించిన ఆమె మాట్లాడారు. మండలంలో ఇప్పటివరకు 1,303 ఇళ్లు మంజూరు కాగా, లబ్ధిదారులంతా నిర్మాణ పనులు మొదలుపెట్టాలన్నారు. తద్వారా దశల వారీగా బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. ఎంపీడీఓ అశోక్‌కుమార్, హౌసింగ్ ఏఈ పుష్ప, గ్రామ కార్యదర్శి రాంబాబు, మాజీ సర్పంచ్ తమ్మిన నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
బోనకల్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందగానే లబ్ధిదారులు నిర్మాణాలను ప్రారంభించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. మండలంలోని కలకోటలో గురువారం ఆమె పలు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి మాట్లాడారు. నిర్మాణం జరుగుతుంటే దశల వారీగా బిల్లులు మంజూరవుతాయని తెలిపా రు. ఎంపీఓ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.