
సంస్థాగతంగా బలోపేతానికి చర్యలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీని పోలింగ్ బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామకం కోసం గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టును అమలుచేయగా స్వయంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యవేక్షించారని తెలిపారు. అదే మాదిరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తనతోపాటు ఇతర జిల్లాలకు తొమ్మిది మంది ఇన్‌చార్జిలను నియమించారని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్, ప్రభుత్వ బోర్డుల డైరెక్టర్లు, సభ్యుల నియామకం కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ కోసం కష్టించిన వారిలో ఇద్దరికి తగ్గకుండా పేర్లను ఈనెల 12లోగా ప్రతిపాదిస్తామని తెలిపారు. అంతేకాక జిల్లా కాంగ్రెస్ కమిటీలను సమీక్షించి నూతన కమిటీల ఏర్పాటుకు అర్హులైన వారిని టీపీసీసీకి ప్రతిపాదిస్తామని వెల్లడించారు. జిల్లా, మండల స్థాయి కమిటీల నియామకం తర్వాత గ్రామ కమిటీలతో పాటు పోలింగ్ బూత్ కమిటీలను నియమిస్తామని, ఈ విషయంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జిల్లా, మండల కమిటీలో 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించనున్నామని, ప్రతీ కమిటీలో 50 శాతానికి తగ్గకుండా 50 ఏళ్ల వయసు లోపువారిని నియమిస్తామని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉండవని, భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉంటాయని, అందరిదీ సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌గాంధీ గ్రూపు అని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేనట్టుగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు, కేడర్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో పాటు డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నాగా సీతారాములు, మద్ది శ్రీనివాసరెడ్డి, పెసర మహిపాల్‌రెడ్డి, జావేద్, కట్ల రంగారావు, చకిలం రాజేశ్వరరావు, నాగండ్ల దీపక్‌చౌదరి, మద్దినేని బేబి స్వర్ణకుమారి, దైదా రవీందర్, కొత్త సీతారాములు, రఫీదాబేగం, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే పూర్తిస్థాయిలో
కాంగ్రెస్ కమిటీల నియామకం
మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి