
టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుతో ఆస్తులకు రక్షణ
● పాలకుల అలసత్వంతోనే ఆలయ అధికారులపై దాడులు ● దేవాదాయ అర్చక, ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు
ఖమ్మంగాంధీచౌక్: దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్క్‌ను ఏర్పాటుచేయాలని దేవాదాయ, ధర్మాదాయ అర్చక, ఉద్యోగ జిల్లా జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయ భూముల పరిరక్షణకు వెళ్లిన ఈఓ రమాదేవిపై ఏపీలోని పురుషోత్తమపట్నం గ్రామస్తుల దాడి నేపథ్యాన బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో అర్చక, ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని శ్రీ గుంటుమల్లన్న ఆలయంలో జేఏసీ ప్రతినిధులు దాములూరి వీరభద్రరావు, తోటకూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలో దేవాదాయ ఆస్తుల రక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా ఆలయ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడొచ్చని తెలిపారు. కాగా ఆలయ భూముల రక్షణలో పాలకుల అలసత్వం ఉండడంతో ఉద్యోగులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉద్యోగులపై రాజకీయ ఒత్తిడి లేకుండా చూస్తూ భూముల పరిరక్షణపై దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రతినిధులు కె.జగన్మోహన్‌రావు, ఈ.వెంకటేవ్వర్లు, అనిల్, ఆనంద్, చుండూరి రామకోటేశ్వరరావు, కె.రామశర్మ, ప్రసాద్, వేణుగోపాలాచారి, హరిచంద్రశేఖర్, కృష్ణమాచార్యులు, శ్రీకాంత్, మునగలేటి రమేష్ శర్మ, ఆమంచి సురేష్ శర్మ, భార్గవాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈఓపై దాడి సరికాదు..
నేలకొండపల్లి: భద్రాచలం ఆలయ ఈఓపై దాడి చేయడం సరికాదని అర్చకుల సంఘం బాధ్యుడు సౌమిత్రి రమేష్ పేర్కొన్నారు. దాడిని నిరసిస్తూ నేలకొండపల్లిలో అర్చక, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భక్తరామదాసు ద్యాన మందిరం వద్ద రమేష్ మాట్లాడుతూ దాడులకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్చకులు కొడవటిగంటి శివయ్య, ముడుంబ రామానుజచార్యులు, హరి, సిబ్బంది కళ్యాణి, పల్లపుశ్రీను, పి.కృష్ణ పాల్గొన్నారు.

టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుతో ఆస్తులకు రక్షణ