
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య
మధిర: మధిరకు చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బుధవారం రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధిరఆర్‌సీఎం చర్చి రోడ్డులో నివసించే తాండ్ర అనిల్ (45) మున్సిపాలిటీలో 2008 నుంచి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఉమ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, అనిల్ ఇటీవల ఎవరితో సరిగా మాట్లాడడం లేదని తెలిసింది. బుధవారం సోదరుడు హరికి ఫోన్‌చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పాడు. ఆపై సోదరుడు గాలిస్తుండగానే మధిర స్టేషన్ సమీపాన గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలా, అధికారుల ఒత్తిడితో అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసినట్లు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.
డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి
మోతె: బైక్‌పై వెళ్తూ డివైడర్ ఢీకొన్న యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. ఇదే ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మోతె సమీపాన బుధవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురానికి చెందిన బుర్రి వర్ధన్‌బాబు(22) తన స్నేహితుడు కంచర్ల తరుణ్‌తో కలిసి బుధవారం హైదరాబాద్ నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో మోతె సమీపాన అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే క్రమాన డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వర్ధన్‌బాబు మృతిచెందాడు. మృతుడి తండ్రి ప్రభాకర్‌రావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మోతె ఎస్సై యాదవేందర్‌రెడ్డి తెలిపారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
ఎర్రుపాలెం: మండలంలోని బుచ్చిరెడ్డిపాలెంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.13,980 నగదు, సెల్‌ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
బాలికకు గర్భం చేసిన వ్యక్తిపై కేసు
తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడుతండాలో 16ఏళ్ల బాలికను మాయమాటలతో లొంగదీసుకుని ఆమె గర్భానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. బచ్చోడుతండాకు చెందిన బాలిక 8వ తరగతి పూర్తిచేశాక ఇంటి వద్దే ఉంటోంది. అదే తండాకు చెందిన ధరావత్ బాలు ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకోవడం గర్భం దాల్చింది. ఈ విషయమై బాలిక తల్లి ఫిర్యాదుతో బాలుపై కేసు నమోదు చేసి, బాలికను బాలికల సదనంకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.