
ఆశల సాగుకు సిద్ధం
● వైరా రిజర్వాయర్ నుంచి నేడు నీటి విడుదల ● ఆధునికీకరణ పనులను పరిశీలించిన అధికారులు
వైరా: వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రిజర్వాయర్ ఆధునికీకరణ పనులు 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. మరో మూడు రోజుల్లో పనులు నిలిపివేసి, తిరిగి వచ్చే ఏడాది చేపట్టాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు తెలిసింది. ఈ రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే రైతులు వరి నారుమడులు సిద్ధం చేసుకుని, నాట్లు వేసేందుకు సరైన వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది రిజర్వాయర్ కింద సుమారు 25 వేల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
నేడు నీరు విడుదల
రిజర్వాయర్ ఆధునికీకరణ పనులను బుధవారం నీటి పారుదల శాఖ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వరరావు, ఈఈ బాబూరావు, డీఈ శ్రీనివాస్ పరిశీలించారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 16అడుగుల మేర నీరు ఉండడంతో నారుమళ్లకు విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చినట్లు సమాచారం. దీంతో అనధికారికంగా గురువారం నుంచి నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆధునికీకరణ పనుల్లో భాగంగా కుడి, ఎడమ కాల్వల లైనింగ్ పనులు పూర్తయినందున నీరు విడుదల చేస్తే ఒకే రోజులో చివరి ఆయకట్టు భూములకు సైతం నీరు చేరే అవకాశముందని భావిస్తున్నారు. ఈనేపథ్యాన రైతులు వరి నాట్లు వేసుకునేలా వారం పాటు నీరు విడుదల చేయాలని నిర్ణయించగా, నీటిని పొదుపుగా వాడేలా పర్యవేక్షణకు సిబ్బందిని నియమిస్తారు.